సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): స్టాక్స్ ట్రేడింగ్ కోసం ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేస్తూ మేడిపల్లికి చెందిన ఒక వ్యాపారి.. సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 67 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. బాధితుడు ఇంటర్నెట్లో ట్రేడింగ్‌కు సంబంధించిన వెబ్సైట్లలో పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. వెంటనే అతని ఫోన్ నంబర్ ఒక ట్రేడింగ్ గ్రూప్‌లో యాడ్ అయ్యింది. ఆ తర్వాత మీకు ఏదైనా సందేహాలుంటే తెలుసుకోవచ్చని, మీకు సహాయంగా మేముంటామంటూ సైబర్ నేరగాడు నమ్మించాడు. అలాగే ఇతరులు ట్రేడింగ్‌లో పొందుతున్న లాభాలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసి బాధితుడికి పంపించారు. దీంతో బాధితుడు వారు చెప్పిన మాటలు నమ్మి మొదట రూ. 40 వేలు పెట్టుబడి పెట్టగా.. అతని ఖాతాలోకి రూ. 41,440 వచ్చినట్లు చూపించారు.
మరునాడు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఒకటి రెండు రోజుల్లోనే అతని ఖాతాలో స్క్రీన్‌పై రూ. 63.77 లక్షలు లాభాలు కన్పించాయి. వాటిని విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే రూ. 9.9 లక్షలు ప్రాసెసింగ్ ఫీ చెల్లించాలని చెప్పారు. వాటిని అలాగే ఉంచి..మరో రెండు వెబ్సైట్లలో రూ. 35 లక్షలు, ఇంకో వెబ్సైట్లో మరికొంత ఇన్వెస్ట్ చేశారు. ఇలా దఫ దఫాలుగా రూ. 67,31,200 పెట్టుబడి పెట్టగా రూ. 6,795 మాత్రమే లాభంగా పంపించారు. విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.