హిమాయత్‌నగర్, నవంబర్27: కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తూ విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న ఇందిరాపార్కు వద్ద జరిగే మహాధర్నాకు కార్మికులు అధిక సంఖ్యల్లో తరలివచ్చి విజయవంతం చేయాలని పలు కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాల యంలో అన్ని కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా బీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్, రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, నగర కార్యదర్శి కమతం యాదగిరి, ఐఎన్టీయుసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనకప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి.చంద్ర శేఖర్, ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్, సీఐటీయురాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్, టీయుసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యం, ఐఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, ఐఎఫ్టియు రాష్ట్ర నేతలు కృష్ణ, విజయ్, ఎఐయుటీయుసీ రాష్ట్ర నేత భరత్ మాట్లాడారు. కార్మిక హక్కులు, చట్టాలకు కేంద్రం తూట్లు పొడుస్తుందని మండి పడ్డారు.
కా ర్మికవర్గం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం వల్ల కార్మికులు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు యాజ మాన్యాల ముందు బానిసల్లాగా బతకాల్సిన పరిస్థితులు వస్తున్నాయని ఆరోపించారు. లేబర్ కోడ్లలో 12 గంటల పనివిధానం, కాలపరిమితితో కూడుకున్న ఉద్యోగ నియామకాలు, చట్టబద్దంగా సమ్మె చేసే హక్కుసైతం లేదన్నారు. పర్మినెంట్ ఉద్యోగాలను కల్పించకపోవడం, యూనియన్లు పెట్టుకునే అవకాశం లేదని, యూనియన్ గుర్తించాలంటే కంపెనీలలో పనిచేస్తున్న కార్మికుల్లో 52 శాతం సభ్యులై ఉండాలని నిబంధన ఉందని తెలిపారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసేంతవరకు కార్మికులు సంఘటితంగా పోరాటాలు చేయాలని వారు పిలుపు నిచ్చారు.