కవాడిగూడ, అక్టోబర్ 30: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేటాయించిన 100 సీట్లలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దాదాపు 50కి పైచిలుకు ప్యారాచూట్ నేతలకు టికెట్లు అమ్ముకున్నారని బహిష్కృత నేత, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కురువ విజయకుమార్ ఆరోపించారు. ఈ విషయంలో స్పష్టమైన ఆధారాలతో తాము పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు సోమవారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ‘నాడు ఓటుకు నోటు- నేడు ఎమ్మెల్యే సీట్లకు కోట్లు’ అంటూ.. ఎమ్మెల్యే సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ పార్టీని నాశనం చేస్తున్న టీ పీసీసీ అధ్యక్షుడు ‘రేవంత్ రెడ్డి హఠావో, కాంగ్రెస్‌కు బచావో’ నిజమైన కాంగ్రెస్ వాదులారా, ప్యారాచూట్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడగొడుదాం.. మన అస్తిత్వాన్ని కాపాడుకుందాం.. అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి అక్రమంగా టికెట్ల అమ్మకాన్ని నిరసిస్తూ రేవంత్ రెడ్డి హఠావో.. కాంగ్రెస్‌కు బచావో.. అనే వాల్ పోస్టర్‌ను పలువురు నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ఎలాంటి సంజాయిషీ లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఎంత వరకు సమంజసమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకొని నిజమైన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి, వ్యాపారవేత్తల నుంచి కోట్ల రూపాయలు తీసుకొని టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన రెండు జాబితాల్లో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. 65 కాంగ్రెస్ సీట్లను రూ. 600 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. అన్ని గ్రామాల్లో పర్యటించి రేవంత్ రెడ్డి కుట్రలను ఎండగడుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి హఠావో.. కాంగ్రెస్ బచావో.. అనే నినాదంతో ముందుకు వెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బాబా ఖలీముద్దీన్, తిమ్మయ్య, పోతు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.