Manikonda | మణికొండ, మే 26 : హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలకు దిగారు. సోమవారం నాడు అక్రమ కట్టడాలను కూల్చివేశారు.
గత కొన్నాళ్లుగా మణికొండ మునిసిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్, పంచవటి కాలనీ, గో గ్రీన్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, నెక్నాంపూర్, పుప్పాలగూడ తదితర ప్రాంతాలలో నిబంధనలను అతిక్రమించి పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. కాగా ఇటీవల స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి సంతోశ్ సింగ్ నేతృత్వంలో గో గ్రీన్ కాలనీలో వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. సోమవారం పంచవటి కాలనీలోని రామారావు అనే బిల్డర్ కు చెందిన ఓ నిర్మాణం సెల్లారు తో కలిసి నాలుగు అంతస్తులకు అనుమతి పొంది.. అదనంగా రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టడంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ సిబ్బందితో కలిసి కూల్చివేతలను చేపట్టారు.
అనుమతి లేకుండా నిర్మించిన రెండో అంతస్తులోని స్లాబ్‌లను తొలగించి సదరు బిల్డర్‌పై పోలీసు కేసు నమోదు చేస్తామని టౌన్ ప్లానింగ్ అధికారి సంతోశ్ సింగ్ తెలిపారు. మున్సిపాలిటీలో పరిధిలో పలుచోట్ల నిబంధనలను అతిక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వారిని గుర్తించి ఇప్పటికే నోటీసులు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలోనే పోలీసు బందోబస్తు తో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని పలుచోట్ల అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు చెప్పారు.