Hyderabad Police | సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఒకే పోలీస్ స్టేషన్లో ఏండ్ల తరబడి పనిచేస్తున్న వారిపై ఉన్నతాధికారులు దృష్టి పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న పోలీస్స్టేషన్లలో చాలాకాలంగా అదే పోలీస్‌స్టేషన్ , డివిజన్ పరిధిలో పాతుకుపోయిన సిబ్బందిపై రోజురోజుకూ ఆరోపణలు పెరుగుతున్నాయి. పీఎస్‌కు వచ్చే ఫిర్యాదుదారులు మొదలుకొని నిందితుల వరకూ ఎవరినీ వదలకుండా వసూళ్లకు పాల్పడుతున్నారని సాక్షాత్తూ పోలీస్ కమిషనర్ దృష్టికే చాలా ఫిర్యాదులు వచ్చాయి.
ఇటీవల వెస్ట్ జోన్లో కొందరు సిబ్బందికి స్థానచలనం కల్పించినప్పటికీ, మిగతా జోన్లలో కూడా ఇదే తరహాలో ఉన్నవారందరి లిస్ట్ తయారు చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో తగ్గేది లేదని, వారిని కచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయడానికి సీపీ నిర్ణయించినట్లు తెలిసింది. అసలు ఈ బదిలీలు కొద్ది రోజుల ముందే జరగాల్సి ఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితా తయారవుతుండగానే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో బదిలీల నిర్ణయాన్ని పక్కన పెట్టి ఆయా జోన్ల ఉన్నతాధికారులను అలర్ట్ చేసినట్లు తెలిసింది.
ఎన్నో ఏండ్లుగా ఒకే పీఎస్‌లో!
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఏడు జోన్ల పరిధిలో మొత్తం 71 పీఎస్‌లు ఉన్నాయి. ఇందులో కొత్తగా వెస్ట్‌జోన్‌లో బోరబండ, మధురానగర్, మాసబ్‌ట్యాంక్, ఫిల్మ్‌నగర్ ఉండగా.. ఈస్ట్ జోన్లో వారాసిగూడ, సౌత్వెస్ట్జోన్లో గుడిమల్కాపూర్, సౌత్ఈస్ట్ జోన్లో బండ్లగూడ, ఐఎస్ సదన్, సెంట్రల్‌జోన్‌లో దోమలగూడ, సెక్రటేరియేట్, ఖైరతాబాద్ పోలీస్స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేశారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు ర్యాంకింగ్ ఇచ్చి ఆయా పీఎస్‌లకు ఎస్సైలను, సిబ్బందిని కేటాయించారు.
కమిషనరేట్ పరిధిలోని స్టేషన్లలో కొత్త వాటిని మినహాయిస్తే మిగతా చోట్ల చాలా ఏళ్లుగా హోంగార్డులు, ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు అదే స్టేషన్లో కానీ, ఆ డివిజన్లో కానీ ఉంటున్నారు తప్ప వేరే చోటకు మారడం లేదు. కొంతమందైతే అయిదేళ్ల నుంచి ఎనిమిదేళ్లుగా అక్కడే పనిచేస్తున్నారని, పెట్రోకార్, బ్లూకోల్ట్స్లో వీరంతా అత్యధికంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
కొందరు హోంగార్డులైతే మధ్యలో బదిలీ అయినా తమకు ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాలతో, లోకల్ లాబీయింగ్‌లో మళ్లీ అక్కడకే వస్తున్నారని ఒక పోలీస్ అధికారి చెప్పారు. ఆయా స్టేషన్లలో హోంగార్డుల నుంచి ఎస్సైల వరకు పలువురిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో కొందరు ఫిర్యాదు దారులు ఏకంగా ఉన్నతాధికారుల దృష్టికే వీరి అవినీతి బాగోతాన్ని తీసుకెళ్లినట్లుగా తెలిసింది. దీంతో వీరందరికీ సంబంధించిన లిస్ట్ తయారుచేయాల్సిందిగా ఎస్బీ విభాగానికి సీపీ చెప్పినట్లు తెలిసింది. ఈ లిస్ట్ కూడా తయారై సీపీ చేతికి చేరిందని సమాచారం.
బదిలీలకు కోడ్ అడ్డంకి..!
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు అవినీతి అధికారులు, సిబ్బందికి సంబంధించిన లిస్ట్ సీపీ సీవీ ఆనంద్ చేతికి వచ్చిందని తెలిసింది. ఇందులో ప్రధానంగా ముగ్గురు ఏసీపీలు, పదకొండుమంది ఇన్స్పెక్టర్లు, మిగతా సిబ్బందిపై ఫిర్యాదులున్నాయి. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన సీపీ చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ముఖ్యంగా ఏసీపీల విషయంలో సీపీ ఆగ్రహంగా ఉన్నారు. కిందస్థాయిలో ఉన్న సిబ్బందిలో కొందరిని తమ ఏజెంట్లుగా పెట్టుకుని వారి ద్వారా ఫిర్యాదుదారులు, నిందితుల వద్ద డబ్బుల దందా చేస్తున్న వారిపై అధికారుల చేతివాటానికి చెక్ పెట్టాలని సీపీ డిసైడయ్యారు.
ఇందుకోసం బదిలీలకు రంగం సిద్ధం చేసినా ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వల్ల ప్రస్తుతానికి నిలిపేశారు. కోడ్ ముగిసిన తర్వాత చర్యలకు పూనుకోనున్నట్లు తెలిసింది. కోడ్ రావడానికి కొద్ది రోజుల ముందు కమిషనరేట్ పరిధిలో నలుగురు సీఐలపై బదిలీ వేటు వేశారు. ఒక్క బదిలీ మాత్రమే కాకుండా శాఖాపరమైన చర్యలకు కూడా వెనక్కు తగ్గేది లేదని, కొన్ని పోలీస్స్టేషన్లను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని ఒక పోలీస్ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.