Job Mela | జూబ్లీహిల్స్, ఏప్రిల్ 15: హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(నిమ్స్‌మే)లో బుధవారం నాడు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్న నిరుద్యోగ యువతకు వృత్తి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఎమ్ఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, అసిస్టెన్స్ టు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ (ఏటీఐ) పథకం కింద ఉద్యమిత్వ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు నైపుణ్య శిక్షణల ఇన్చార్జి వి.స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ ఫెయిర్‌లో దేశంలోని 22 ప్రముఖ కంపెనీలు పాల్గొని నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఎస్క్యూఎఫ్) ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగాలను అందించనున్నాయని తెలిపారు. ఇందులో ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసులు, బ్యూటీ అండ్ వెల్నెస్, ఫుడ్ ప్రాసెసింగ్, అపారెల్ అండ్ టెక్స్టైల్ రంగం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ తదితర రంగాల కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. శిక్షణ పొందిన అభ్యర్థులు మాత్రమే కాకుండా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే ఏ రంగానికి చెందిన నిరుద్యోగ యువత అయినా ఈ జాబ్ ఫెయిర్‌కు హాజరుకావచ్చని చెప్పారు. శిక్షణ పొందిన అభ్యర్థులు, తాజా డిగ్రీ పట్టభద్రులతో పాటు ఉద్యోగ మేళాలో పాల్గొనే అభ్యర్థులు తమ బయోడేటా, గుర్తింపు పత్రాలు, సంబంధిత సర్టిఫికెట్లు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 040_23633218/ 61, ఈ మెయిల్: swapna @ nimsme.gov.in లో సంప్రదించాలని సూచించారు.