సగటు నగరవాసి గుండెల్లో గునపం ‘హైడ్రా’ (హైదరాబాద్ విపత్తుల ప్రతిస్పందన మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ). విపత్తుల నివారణ, ఆస్తుల పరిరక్షణేమో గానీ, సగటు నగరజీవి బతుకును చిన్నా భిన్నం చేసింది. హైడ్రా హైదరాబాద్ నగరానికి ఎలాంటి విపత్తులను రాకుండా చేస్తుందో, ప్రభుత్వ ఆస్తులను ఎన్ని వేల ఎకరాల్లో కూడబెడుతుందో.. తెలియదు గానీ, దేదీప్యమానంగా వెలుగుతున్న సామాన్యులు, మధ్య తరగతి వాసుల ఇంటి దీపాలను ఆర్పేసి, వారి జీవితాలను అంధకారం చేసి ఆడుకుంటుంది.
ఎంతో మంది పెద్దల ఇండ్లు అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ వారిపై ఎలాంటి ప్రతాపం చూపలేకపోయింది. సులభంగా దొరికిన సామాన్యుల బతుకులపై హైడ్రా గునపం దింపింది. వంద రోజుల తన ప్రయాణంలో నగరంలోని 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాలను నేలమట్టం చేసింది. హైడ్రా చర్యలపై హైకోర్టు సైతం ప్రశ్నించినా.. ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా ముందడుగు వేస్తూనే ఉంది. రోజుకో రూపంతో సామాన్యుల బతుకుల్లో నిప్పులు పోస్తూనే ఉంది.
HYDRAA | సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ను హడలెత్తించిన హైడ్రా.. ఏర్పాటై రేపటికి (శనివారం) సరిగ్గా వంద రోజులు. చెరువుల విపత్తు నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటివరకు ఓఆర్ఆర్ లోపల 262 నిర్మాణాలు కూల్చివేసింది. విపత్తు నిర్వహణ, ఆస్తు ల రక్షణగా ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్’ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్లు జూలైలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు ఈ విభా గం పనిచేస్తున్నదని ప్రకటించారు. హైడ్రా ఏర్పాటు చేస్తున్నట్లు జీవో నం.99ను జూలై 19న ప్రభుత్వం విడుదల చేసింది. గవర్న ర్ ఆర్డినెన్స్‌పై సంతకం పెట్టిన తర్వాత గెజిట్‌ను విడుదల చేయడంతో హైడ్రాకు పూర్తి అధికారాలు వచ్చినట్లయ్యింది. వందరోజు ల హైడ్రా వ్యవస్థలో పెద్దల కంటే పేదల పైనే ఫోకస్ అధికం చేసి వారి ఇళ్లపైకే బుల్డోజర్లు పంపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కోర్టు సై తం హైడ్రా కమిషనర్‌ను ఈ విష యంలో సీరియస్‌గా ప్రశ్నించిన పరిస్థితి చూశాం. ‘కనీసం నోటీసులు ఇ వ్వకుండా ఎలా కూల్చేస్తారు?’ అని న్యాయస్థానం ప్రశ్నించింది. హైడ్రా 100 రోజుల పరిణామాల్ని చూద్దాం..
హైడ్రా కమిటీకి చైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డితో పురపాలక, రెవెన్యూ శాఖల మంత్రులు, గ్రేటర్ పరిధిలోని జిల్లాల ఇన్చార్జి మంత్రులు, జీహెచ్ఎంసీ మేయ ర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రెవెన్యూ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం అధిపతి సభ్యులుగా ప్రధానమైన పాలక మండలి ఉంటుంది. విధానపరమైన నిర్ణయాలపై ఈ కమిటీ మార్గ నిర్దేశనం, సమీక్షలు చేస్తుంది. తెలంగాణ కోర్ అర్బన్ రిజియన్(టీసీయూఆర్) పరిధిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ రెండో కమిటీగా పనిచేస్తుంది.
దీనికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, ఇతర శాఖలు, విభాగాల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ రెండు కమిటీల్లో హైడ్రా కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాట ర్ బోర్డు, సిటీ ట్రాఫిక్, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలు హైడ్రాలో పని చేస్తాయి. హై డ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు అక్టోబర్ 5న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఐతే, హైడ్రా నిర్వహణకు సంబంధించి రెండు కమిటీలున్నా.. మొత్తం నిర్వహణ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే బాస్‌గా వ్యవహరిస్తున్నారు.
హైడ్రా ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, జంట జలాశయాలు ఎఫ్టీఎల్లో కట్టడాలను, పార్కు స్థలాల్లో మొత్తం 23 చోట్ల 262 నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. రెండు నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. వీటిలో అత్యధికంగా గాజుల రామారంలోని చింతల్ చెరువుల ఒడ్డున 54 నిర్మాణాలను కూల్చేశారు. రాజేంద్రనగర్‌లోని భూమురక్ డౌలాలో 45 నిర్మాణాలు ఉన్నాయి. ఇదే క్రమంలో లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బాచుపల్లి, చందానగర్, అమీర్‌పేట, అమీన్పూర్, గుట్టల బేగంపేట, మల్లంపేటలలో పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు.
హైడ్రా కూల్చివేతల్లో ఇరవై శాతం పెద్దలకు సంబంధించిన నిర్మాణాలు కాగా., మిగతావన్నీ పేదలకు, మధ్యతరగతి వారికి సంబంధించినవి కావడం గమనార్హం. పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరి సీడ్స్ అధినేత జీవీ భాస్కర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ రెడ్డి, ప్రొ కబడ్డీ ఓనర్ అనుపమ, సినీ నటుడు నాగార్జున, చింతల్లో బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు ఉన్నారు. పటేల్‌గూడ పరిధిలోని బీఎస్ఆర్ కాలనీ పక్కన ప్రభుత్వ భూమి లో నిర్మించిన 24 ఇళ్లను కూల్చేశారు. నల్ల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 16 ఆక్రమణలంటూ రేకుల షెడ్డులను గంటల వ్యవధిలోనే నేలమట్టం చేశారు. సున్నం చెరువులో పేదల ఇళ్లను కూల్చేశారు.
అనుమతులుంటే కూల్చేయమంటూ సీఎం రేవంత్‌తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించినప్పటికీ.. అంతకు ముందే హైడ్రా కూల్చివేతల్లో అనుమతులున్న భవనాలపై జవాబుదారీ ఎవరు? అనే ప్రశ్న తలెత్తుతోంది. శేరి లింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్ హఫీజ్‌పేట డివిజన్ మదీనాగూడలోని సర్వే నం.26లో ఈర్ల చెరువు బఫర్ జోన్లో ఉన్నారంటూ ఆగస్ట్ 19న భవనాలను కూల్చేశారు. తమకు అనుమతులున్నాయని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉందంటూ భవన యజమానులు చెప్పినా హైడ్రా వినకుండాకూల్చేసింది. మదీనాగూడలోని ఎర్ల చెరువులో కూడా కొన్ని నిర్మాణాలకు అనుమతులిచ్చారు. అయితే, కొన్నిచోట్ల అనుమతులిచ్చిన అధికారులపై ఫిర్యాదులు చేసి కేసులు పెట్టించడం వరకు హైడ్రా ఆలోచించింది తప్ప, ఆ నిర్మాణాల కూల్చివేతలతో మధ్యతరగతి, పేదవారు పూర్తిగా నష్టపోతున్నారని తెలిసీ దూకుడుగా వ్యవహరించింది.
జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ బాడీలు, పబ్లిక్ ప్లేసెస్, పార్కు లు తదితర ప్రభుత్వ, జీహెచ్ఎంసీ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా రక్షించడాని కి హైడ్రాకు అధికారం కల్పించింది. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులివ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపునకు అధికారం కల్పించే జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 374బీని హైడ్రా అధికారాలుగా చేరుస్తూ గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్‌కు పొడిగింపుగా, ఈ గెజిట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. జీవోపై కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ హైడ్రాకు విశేష అధికారాలొచ్చాయని, ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేతకు నోటీసులిస్తుందన్నారు. అదే విధంగా అనధికారిక భవనాలకు సీజ్ చేసే అధికారం కూడా హైడ్రాకు ఉందన్నారు.
హైడ్రా తన అధికారాల్లో అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతున్న ఇండ్లకు, భవనాలకు నోటీసులు ఇస్తామని, అనధికారిక భవనాలను సీజ్ చేస్తామని చెప్పారు. కానీ, వనస్థలిపురం పరిధిలోని సాగర్ కాంప్లెక్స్, బీఎన్‌రెడ్డి నగర్ చౌరస్తాలో, సచివాలయనగర్లోని భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం సీజ్ చేశారు. అయితే, అనధికారిక భవనాలను సీజ్ చేసే అధికారం తమదేనన్న హైడ్రా ఈ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు. జీహెచ్ఎంసీ అధికారాల బదలాయింపు తర్వాత సీజ్ చేయడం, నోటీసులు జారీ చేయడం వంటి అధికారాలు కలిగిన హైడ్రా ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేయలేకపోవడానికి కారణాలేంటి? గతంలో పనిచేసిన కమిషనర్‌తో పాటు ప్రస్తుతం కమిషనర్‌తోనూ హైడ్రా కమిషనర్‌కు కొంత విభేదాలున్నట్లు తెలుస్తోంది.
హైడ్రా అంటే అనేక తలల జంతువు అన్నట్లుగా హైడ్రా వ్యవస్థ కూడా రోజుకొక రూపంలో హడావిడి చేస్తోంది. కూల్చివేతల నుంచి చెరువుల సుందరీకరణ, నగరం లో డిజాస్టర్ మేనేజ్మెంట్.. ఇలా రెండు రోజులు సమీక్షలు నిర్వహించారు. ఆ త ర్వాత ఒక ఎన్జీవోతో బెంగళూరు టూర్ ప్లాన్ చేశారు. అటు నుంచి హైడ్రా గ్రేటర్లో ట్రాఫిక్‌పై దృష్టి పెట్టింది. ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌తో కలిసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై సమీక్ష నిర్వహించింది. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ వారితో రెండు రోజులు గ్రేటర్ లో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటూ రాజ్‌భవన్ రోడ్డు, లక్డీకాపూల్‌లో హడావిడి చేశారు. అటు నుంచి వృక్షాల పరిరక్షణకు అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.