Caste Census | సిటీబ్యూరో: కుల గణనలో ఇప్పటి వరకు నమోదు కానీ వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ 040-21111111 నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. ఇప్పటి వరకు కుల గణనలో నమోదు కానీ కుటుంబ సభ్యులు మాత్రమే కాల్ సెంటర్‌కు కాల్ చేసి వారి, మొబైల్ నంబర్, అడ్రస్‌తో పాటుగా పోస్టల్ పిన్ కోడ్ నంబర్‌ను తెలియజేయాల్సి ఉంటుందన్నారు. కాల్ సెంటర్లో కాల్ వచ్చినప్పుడు ఆపరేటర్ చేయాల్సిన నియమ నిబంధనలపై శనివారం కంప్యూటర్ ఆపరేటర్లకు కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ అవగాహన కల్పించారు. కాల్ సెంటర్లో ఆపరేటర్ అనుసరించాల్సిన విధానాలను వివరించారు. ఈ కాల్ సెంటర్ జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన కాల్స్ కూడా స్వీకరించి, సంబంధిత వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఫార్వర్డ్ చేస్తారని పేర్కొన్నారు. అయితే కాల్ చేసే వ్యక్తి పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఫోన్ నంబర్, పూర్తి అడ్రస్, పిన్ కోడ్ నంబర్ తెలియజేయాల్సి ఉంటుంది.
కులగుణనలో నమోదు కాని వారి కోసం ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మరోసారి సర్వే కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాల్ సెంటర్ ద్వారా పేరు, వీధి, గ్రామం, మొబైల్ నంబర్, ఇంటి నంబర్, పట్టణాల్లో అయితే సర్కిల్ లేదా వార్డు నంబర్ వివరించిన పక్షంలో అడ్రస్ ప్రకారం ఎన్యుమరేటర్ వారి ఇంటికి వెళ్లి కులగణన చేస్తారు. మొబైల్ నంబర్‌తో సెర్చ్ చేసి సంబంధిత వ్యక్తి పాత డేటా బేస్‌లో నమోదు అయ్యారా లేదా వివరాలు ఉన్నాయా అన్నది పరిశీలించి, లేని పక్షంలో సంబంధిత వ్యక్తి, పేరు, అడ్రస్ అడుగుతారు. ముందుగా జీహెచ్ఎంసీనా లేదా నాన్ జీహెచ్ఎంసీనా అన్న వివరాలు అడుగుతారు. జీహెచ్ఎంసీ పరిధి కానటువంటి వారైతే మున్సిపాలిటీ వార్డు నంబర్, అడ్రస్, గ్రామం అయితే మండలం అడుగుతారు. ఆ వివరాలను తెలియజేసిన పక్షంలో ఎన్యుమరేటర్ ఇంటి వద్దకు వచ్చి సర్వే చేస్తారన్నారు.
గతంలో జరిగిన బీసీ కులగణనలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 8గంటల నుంచి 10 గంటల వరకు చాంద్రాయణగుట్ట పరిధిలోని కుమ్మరివాడి బస్తీలో ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్ మలక్‌పేట పరిధిలోని ముసారాంబాగ్ శాలివాహన నగర్లో, తిరుమలగిరి సురేందర్ గచ్చిబౌలిలోని టీఎన్జీఓస్ కాలనీ పరిధిలోని క్యూసిటీలో నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.