Ganesh Festival | సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్ : గణేశ్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకొనేందుకు భాగ్యనగరం సిద్ధమైంది. గల్లీగల్లీలో గణనాథుడు కొలువుదీరనున్నాడు. తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలందుకోనున్నాడు. నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగే ఉత్సవాల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
మూడో రోజు నుంచి నిమజ్జన కోలాహలం మొదలుకానున్నది. కాగా, హుస్సేన్‌సాగర్, చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రత్నామ్నాయంగా ప్రతి ఏటా తరహాలోనే ఈ ఏడాది కూడా 30 సర్కిళ్ల పరిధిలో తాత్కాలిక కోనేరులను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న 27 బేబీ పాండ్స్లతో పాటు అదనంగా మరో 46 ప్రాంతాల్లో తాత్కాలిక పోర్టబుల్ వాటర్ ట్యాంక్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
పర్యావరణ పర్యావరణ హితమైన గణనాథుల పూజ కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా మట్టితో రూపొందించిన 3 లక్షల పదివేల విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేసింది. ఇక మండపాల నుంచి గణనాథులను నిమజ్జనానికి తీసుకువెళ్లే మార్గాల్లో ఎలాంటి అవంతరాలు లేకుండా చెట్ల కొమ్మలను తొలగించడం, రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చివేసి సాఫీగా గణేశ్ శోభాయాత్ర జరిగేలా ఏర్పాట్లు చేసింది.
గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో అన్ని వీధుల్లో వీధి దీపాలు వెలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు శానిటేషన్ నిర్వహణపై కూడా శ్రద్ధ పెట్టాలని అధికారులకు బల్దియా కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. మరోవైపు వినాయక ఉత్సవాల నేపథ్యంలో మంచినీటి సరఫరా, సీవరేజీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జలమండలి ఎండీ అధికారులను ఆదేశించారు.
గణేశ్ మండపాలకు నిరంతర విద్యుత్ సరఫరా, భద్రతాపరంగా విద్యుత్ శాఖ తీసుకున్న చర్యలపై టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ ముషారఫ్ ఫరూఖీ శుక్రవారం సమీక్షా సమావేశాన్నినిర్వహించారు. ఈనెల 7 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 11 రోజుల పాటు జరుగనున్న నేపథ్యంలో మండపాలకు నిరంతరం ఉచితంగా విద్యుత్ సరఫరా, భద్రత కోసం తమ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని సీఎండీ తెలిపారు.
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ప్రతి ఏడాది తొమ్మిది రోజుల్లో సుమారు కోటిమందికిపైగా దర్శనానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గతంలో 40 సీసీ కెమెరాలు ఉండగా, ఈ ఏడాది వాటి సంఖ్యను పెంచారు. సమారు 70 సీసీ కెమెరాలతో 24/7 నిఘా పెట్టారు. భక్తులు సెన్సేషన్ థియేటర్, ఖైరతాబాద్ రైల్వే గేటు, మింట్ కాంపౌండ్ నుంచి వార్డు కార్యాలయం మీదుగా వెళ్లి దర్శనం చేసుకునే వీలు కల్పించారు. ప్రతి ఎంట్రీ వద్ద డోర్‌ఫ్రేమ్ డిటెక్టర్, ప్రతి ఒక్క భక్తుడిని మెటల్ డిటెక్టర్ ద్వారా పరీక్షించిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.
ఖైరతాబాద్‌లోని బడా గణేశ్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి ఈనెల 17 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. బడాగణేశ్ రూట్లో వచ్చే ట్రాఫిక్‌ను ఖైరతాబాద్ రాజీవ్ విగ్రహం, రాజ్‌దూత్ లేన్ , మింట్ లేన్ ఎంట్రెన్స్, నెక్లెస్ రోటరీ, పోస్టాఫీసు వద్ద ఇతర రూట్లకు మళ్లించనున్నట్లు వివరించారు. బడాగణేశ్ వద్దకు ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని, దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లోని జంక్షన్లు, రూట్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని, ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు.