మొయినాబాద్, జులై 07 : హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని తాజ్ సర్కిల్ హోటల్ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ బతుకు దెరువు కోసం వలస వచ్చి మొయినాబాద్లో నివాసం ఉంటూ ఆటో నడుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
మంగళవారం పాల్సిలింగ్ కు సంబంధించిన మెటీరియల్ను ఆటో పై భాగంలో కట్టుకొని మొయినాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్నాడు. మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి రెవిన్యూలో గల ప్రభుత్వ భూమి నుంచి టిప్పర్ మట్టిని తీసుకొని మొయినాబాద్ వైపు వస్తున్నది. సరిగ్గా తాజ్ సర్కిల్ సమీపం వరకు రాగానే టిప్పర్ ఎదురుగా అతివేగంతో వచ్చి ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడికి అక్కడే మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ పరార్ అయ్యాడు. మృతదేహాన్ని చేవెళ్ల దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.