అంబర్ పేట, జూలై 19: ఈనెల 20, 21 తేదీల్లో రెండు రోజులు పాటు జరిగే ఆషాడ మాస బోనాల జాతరకు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తూర్పు మండలం డీసీపీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. జోన్ పరిధిలోని 10 పోలీస్ స్టేషన్లో కిందకు వచ్చే అన్ని అమ్మవారి దేవాలయాల వద్ద బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
డీసీపీ డాక్టర్ బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ.. బోనాల బందోబస్తు వివరాలను వెల్లడించారు. తూర్పు మండల పరిధిలో సుల్తాన్ బజార్, నారాయణగూడ, కాచిగూడ, అంబర్పేట, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ, వారాసిగూడ, చిలకలగూడ, లాలాపేట, లాలాగూడ పోలీస్ స్టేషన్ లు ఉన్నాయని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధానంగా మూడు చోట్ల బోనాల ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పారు. అందులో కాచిగూడ నింబోలి అడ్డ మహంకాళి అమ్మవారు, అంబర్ పేట మహంకాళి అమ్మవారు, చిలకలగూడ అమ్మవారి దేవాలయాల వద్ద ఆది, సోమవారాలు రెండు రోజులపాటు బోనాల ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయని, అక్కడ ప్రత్యేకమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వెయ్యి మంది తమ పోలీసు సిబ్బందితో పాటు అదనపు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బోనాలు, ఫలహారపు బండ్ల నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి తగిన సూచనలు, సలహాలు అందజేయడం జరిగిందన్నారు. అలాగే జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఆర్అండ్బీ, ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేస్తూ బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకొంటున్నట్లు వెల్లడించారు. బోనాల సందర్భంగా భక్తులు, నిర్వాహకులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.