సిటీ బ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): జిల్లా పరిధిలో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)ను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో.. నీట్ పరీక్ష నిర్వహణపై సెంటర్ సూపరింటెండెంట్లు, సిటీ కోఆర్డినేటర్స్, బ్యాంక్లు, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే 4న జరిగే నీట్ పరీక్షకు జిల్లాలో 62 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 26,609 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, అన్ని కేంద్రాలను ముందుగా తనిఖీ చేసి నివేదిక అందించాలని సూచించారు. ట్రాఫిక్ దృష్ట్యా అభ్యర్థులందరూ కేంద్రాలకు ముందుగా చేరుకోవాలని అన్నారు. ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఉదయం నుంచి పరీక్ష ముగిసే వరకు అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, అదనపు డీసీపీలు నర్సింహారావు, రామదాస్ తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం తనిఖీ..
సిటీ బ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరు, ఆలస్యంగా వచ్చిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తదనంరతం సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయంలోనూ కలెక్టర్ రికార్డులను పరిశీలించారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సికింద్రాబాద్ పరిధిలో వచ్చిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తులపై కలెక్టర్ ఆరాతీసారు. ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ పాండు నాయక్ ఆయన వెంట ఉన్నారు.