సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి నిలయం సందర్శనకు ఈ నెల 14 నుంచే ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ షురూ కానుండగా, తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది (మార్చి 22) నుంచే పర్యాటకులను అనుమతించనున్నారు. కాగా, భారతీయులకు రూ.50, విదేశీయులకు రూ.250 రుసుం చెల్లించాలని నిర్ణయించారు. 162 ఏండ్ల చరిత్ర కలిగిన రాష్ట్రపతి నిలయం దట్టమైన ఆకుపచ్చని అందాలు, తీరొక్క పూలమొక్కలు, ఔషధమొక్కలతో పర్యాటకులను ఆకట్టుకోనుంది.
యాత్రికులకు పార్కింగ్, క్లాక్‌రూం, వీల్‌చైర్, కాఫీ షాప్ సావనీర్స్టోర్, రెస్ట్‌రూమ్స్, ఆర్వో వాటర్, క్యాంపస్‌లో డిస్పెన్సర్లు, ఫస్ట్ ఎయిడ్ సెట్‌తో పాటు ఉచితంగానే గైడ్స్ కూడా అందుబాటులో ఉంటారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతి కార్యాలయం అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్గుప్త రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 15లోగా ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 22న (ఉగాది పండుగను పురస్కరించుకొని) ఉదయం 11గంటలకు రాష్ట్రపతి ద్రౌపతిముర్ము ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నట్లు తెలిసింది.
ఇంతకుమునుపు ప్రతి సంవత్సరం శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి భారత ప్రథమ పౌరురాలు వచ్చి వెళ్లిన తర్వాతే 15 రోజుల పాటు సాధారణ సందర్శకులను రాష్ట్రపతి నిలయంలోకి అనుమతి ఉండేది. ఇకపై ఏడాది పొడవునా పర్యాటకుల సందర్శనకు అవకాశంకల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ సెలవు రోజులు మినహా మిగతారోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రాష్ట్రపతి నిలయాన్ని వీక్షించేందుకు అనుమతిచ్చింది. ప్రతి సోమవారంతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో సందర్శకులను అనుమతించరు. సాయంత్రం 4 గంటల వరకే నిలయంలోకి ప్రవేశం ఉంటుంది.