మేడ్చల్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు నిర్మించ తలపెట్టిన 18 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌కు అడుగడుగునా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు అందుకున్న వారు భూసేకరణ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కారిడార్ నిర్మా ణం 200 అడుగుల వెడల్పుతో కాకుండా వంద అడుగుల వెడల్పుతోనే సరిపెట్టాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామస్తులు గ్రామసభల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పార్యడైస్ నుంచి శామీర్‌పేట్ రింగ్ రోడ్డు వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్(ఫ్లైఓవర్బ్రిడ్జి) నిర్మాణానికి సంబంధించి 2 వందల అడుగుల వెడల్పైన రోడ్డు అవసరమని అధికారులు గుర్తించారు. అందుకోసం అవసరమైన భూసేకరణ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. 2వందల అడుగుల విస్తరణ కోసం రోడ్డుకు రెండు వైపులా లక్ష 26 వేల చదరపు అడుగుల భూమి అవసరానికి సంబంధించి, 384 నిర్మాణాలకు సర్వే చేసిన అధికారులు మార్క్అవుట్ను పూర్తి చేశారు.
ఆస్తులు కోల్పోతున్న వారందరూ గ్రామ సభకు హాజరు కావాలని నోటీసులు అందించారు. అయితే తూంకుంట మున్సిపాలిటీలో గురువారం అధికారులు నిర్వహించిన సభకు తూంకుంట, పోతాయిపల్లి, హకీంపేట్‌లలో భూ సేకరణలో ఆస్తులు కోల్పోతున్న వారు ఆందోళన చేశారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి వంద ఫీట్ల భూమి మాత్రమే సరిపోతుందని, అదనంగా మరో వంద ఫీట్లు భూ సేకరణ చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞాప్తి చేశారు. భూ సేకరణ వల్ల తాము అన్యాయానికి గురువుతామని సభకు వెళ్లకుండా బహిష్కరించారు. దీంతో తూకుంట, పోతాయిపల్లి, హకీంపేట్ గ్రామాలకు చెందిన భూ సేకరణ పక్రియపై మరోమారు గ్రామ సభను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పాడింది. అంతేకాక భూ సేకరణ పక్రియపై ఇప్పటికే 325 అభ్యంతరాలు వచ్చిన విషయం విదితమే. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి సాంకేతిక సమస్యలు అధిగమించేది, పనులు ప్రారంభించేది ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ముఖ్యంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో శామీర్‌పేట్ రింగ్ రోడ్డు నుంచి సికింద్రాబాద్‌లోని లోతుకుంట వరకు 12 కిలో మీటర్ల భూ సేకరణ పక్రియలో అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ గుర్తింపు పక్రియను ఇటీవలే ప్రభుత్వం పూర్తి చేసింది. ఆస్తులను గుర్తిస్తూ నోటీసులు అందించింది. కాగా ఆస్తులు కోల్పోతున్న వారు అవార్డు జారీ కోసం నిర్వహిస్తున్న గ్రామ సభలకు సహకరించడం లేదు. ఇందులో భాగంగానే భూ సేకరణపై రెవెన్యూ భూ సేకరణ అధికారులు తూకుంటలో గురువారం నిర్వహించిన సభను ఆస్తులు కోల్పోతున్న ప్రజలు బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో భూ సేకరణ పక్రియ ముందుకు వెళ్లేందుకు మరింత అలస్యం అయ్యే అవకాశం ఉంది.
గ్రామసభల పేరుతో టైమ్ పాస్ చేస్తున్నారు. పిల్లల భవిషత్తు కోసం అప్పులు చేసి ముందుకు వచ్చాము. తూంకుంట పట్టణంలో భవనం కడితే భవిష్యత్తు బాగుంటుందని .. బ్యాంకుల్లో అప్పులు చేసి కట్టాను. మేం ఇలా ఇల్లు కట్టుకోగానే .. ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరుతో మా ఇల్లు లాగేసుకుంటున్నారు.
– మధుమోహన్ రెడ్డి, తూంకుంట
దళిత కుటుంబాల్లో ఈ ప్రభుత్వం చిచ్చు పెట్టింది. రోడ్డు విస్తరణ ప్రచారం మొదలు ఇప్పటికే గుండె పగిలి తూంకుంటలో ముగ్గురు చనిపోయారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తారో తెలియడం లేదు. మేం 240 మంది దరఖాస్తు ఇచ్చాం. మేము అడిగిన ఏ ప్రశ్నకూ సమాధానం రాలేదు. వంద ఫీట్ల రోడ్డైతే అంగీకరిస్తాం. పుట్టిన ఊరినుండి తట్టా బుట్టా సర్దుకొమ్మని పొమ్మంటే సహించేది లేదు. 200 ఫీట్ల రోడ్డేస్తే భూమికి బదులుగా భూమి ఇవ్వండి
– సుభాష్ గౌడ్, తూంకుంట.
ఆ రోజుల్లో భూమి అమ్మి ఇక్కడ 180 గజాలు కొన్న. ఈ రోడ్డు పుణ్యమాని ఆ బిల్డింగ్ కు మార్కింగ్ చేశారు. అది కూడా రోడ్డు కోసం ఇస్తే నా పరిస్థితి ఏంది? రోడ్డు విస్తరణకు మేము అడ్డం కాదు. కానీ మాకు భూమికి భూమి ఇవ్వాల్సిందే
– కాసుల రాజయ్య గౌడ్, తుంకుంట.
ఆరు నెలలుగా అప్పుల పాలయ్యం. నాకున్నది ఈ ఒక్క ప్లాటే రోడ్డుకు కట్టుకుని బాగుపడుతామని అనుకున్నాం కానీ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డు విస్తరణ జరుగుతున్నదని ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ఇండ్లు కిరాయికి పోక మాకు 3 లక్షల వరకు నష్టం వచ్చింది. అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఈ రోజు వరకు ఇంతమంది లీడర్లను కలిసినం. ఒక్కరు కూడ పట్టించుకోలేదు. ఉప్పల్ భగాయత్ లో నిర్వాసితులకు ఇచ్చినట్టే మాకు భూమికి బదులుగా భూమిని కేటాయించాల్సిందే.
– విద్యాసాగర్, తూంకుంట.