Hyderabad | బంజారాహిల్స్, ఫిబ్రవరి 23 : జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ట్రాఫిక్ జంక్షన్లో అత్యంత ప్రమాదకరంగా కారుతో స్టంట్స్ చేసిన ఘటనలో ముగ్గురు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్లో ఓ కారుతో నడిరోడ్డు మీద స్టంట్స్ చేస్తూ వాహనదారులను భయబ్రాంతులకు గురి చేశారు ఓ ముగ్గురు యువకులు. ఈ కారు విన్యాసాలను తమ సెల్ఫోన్లో బంధించిన ప్రయాణికులు నగర పోలీస్ కమిషనర్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించారు. దీంతో శనివారం సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదకరంగా స్టంట్స్ చేసిన కారు( ఏపీ 09ఏక్యూ 7209)ను గుర్తించారు.
ఈ మేరకు బీఎన్ఎస్ 292, 281, 125,126(2), 49 రెడ్‌విత్ 54 సెక్షన్లతో పాటు ఎంవీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కారు నడిపిన యువకుడిని మలక్‌పేటకు చెందిన విద్యార్థి మహ్మద్ అబ్దుల్ ఖాదర్(23)గా గుర్తించారు. అతడితో పాటు కారులో ఉన్న ఎండీ.అనాస్ అహ్మదుద్దీన్(22), మహ్మద్ అబ్దుల్ రాహత్(20)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రోడ్లపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు.