Road Accident | హైదరాబాద్ : హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట్లూరులోని నారాయణ కాలేజీ సమీపంలో తెల్లవారుజామున 5.45 గంటలకు డీసీఎం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు.
మృతులను పిన్నింటి చంద్రసేన రెడ్డి(24), చుంచు త్రినాధ్ రెడ్డి(24), చుంచు వర్షిత్ రెడ్డి(23)గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు అలిమేటి పవన్ కల్యాణ్(24)ను చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. వీరంతా కుంట్లూరు వాసులే. ఈ నలుగురు కూడా విద్యార్థులే. స్కోడా కారులో (MH-02-DG-0771) పాసుమాముల గ్రామం నుంచి కుంట్లూరు వైపు వస్తున్నారు. డీసీఎం వ్యాన్(TS-07-UK-2664) కుంట్లూరు నుంచి పాసుమాముల వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.