మల్కాజిగిరి: శ్రీశైలం జలాశయం సందర్శనకు వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. అమ్రాబాద్ ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉండటంతో డ్యామ్‌ను చూసేందుకు అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారానికి చెందిన మాచర్ల కిషన్ కన్నయ్య(22) తన ముగ్గురు స్నేహితులతో కలిసి శనివారం రాత్రి కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు..
నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పటవర్లపల్లి వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కిషన్ కన్నయ్యతో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. కోంపల్లికి చెందిన సాయిప్రకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు. మరణించిన ముగ్గురి మృతదేహాలను పోస్టు మార్టం కోసం అచ్చంపేటలోని ప్రభుత్వ దవాఖానకు తరలించిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.