సైదాబాద్, జూలై 21 : అమెరికాలోని నెవాడా వెల్స్ పట్టణ నార్త్ హైవే-93లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాబాద్ వాణీనగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొదుతున్నారు. గాయపడ్డ వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఐఎస్ సదన్ డివిజన్ లోని వాణీనగర్‌కు చెందిన రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ షేక్ అబ్ధుల్ సయ్యద్ కుమారుడు షేక్ అబ్ధుల్ నవీద్ (47) అమెరికాలోని మార్క్ ఫార్మా కంపెనీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు.
సోమవారం ఉదయం సాన్‌జోస్ టౌన్ నుంచి నవీడాకు కారులో భార్య నాజీయ సల్మా (45), కుమార్తె నేహ నహీం షేక్ (19), కుమారుడు హఫీజ్ ఓమర్ (14), చిన్న కుమార్తె ఖతిజా షేక్ (8)కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణమయ్యారు. భార్య నాజీయ సల్మా (45 ) కారు నడుపుతుండగా వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే భార్య నాజీయ సల్మా, కుమార్తె నేహ నహీం షేక్ (19), కుమారుడు హఫీజ్ ఓమర్ (14) అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడ్డ షేక్ అబ్దుల్ నవీద్, చిన్న కుమార్తె ఖతిజా షేక్ (8) అపస్మారక స్థితిలో ఆస్పుత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు .
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెంది, ఇద్దరు గాయపడ్డ కుటుంబ సభ్యులను మంగళవారం సాయంత్రం యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సెన్ పరామర్శించారు. వాణీనగర్ లో నివాసాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని సానుభూతి వ్యక్తం చేశారు.