మలక్ పేట, మే 6: పాస్‌పోర్టు విచారణకు వెళ్లిన పోలీసు కానిస్టేబుల్‌పై పలువురు దాడి చేశారు. అతన్ని బూతులు తిడుతూ.. బట్టలు చింపి.. దారుణంగా కొట్టారు. దీంతో బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మలక్‌పేట పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
మూసారాంబాగ్‌కు చెందిన టి.సర్వేశం హైదరాబాద్ నగర పోలీసు స్పెషల్ బ్రాంచి సౌత్ ఈస్ట్ జోన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం సోమవారం సాయంత్రం 5.30 గంటలకు గోగు అర్షితకు ఆయన కాల్ చేశారు. అర్షిత తల్లి సునీత ఫోన్ ఎత్తి అడ్రస్ చెప్పింది. దీంతో టి.సర్వేశం గీతాంజలి అడ్మైర్ అపార్ట్మెంట్లోని ఫస్ట్ ప్లోర్‌కు వెళ్లగా.. అర్షిత తల్లి, ఆమె సోదరుడు ఇంట్లో ఉన్నారు. పాస్‌పోర్టు విచారణలో భాగంగా డాక్యుమెంట్లను పరిశీలించిన కానిస్టేబుల్ సర్వేశ్వర్.. అపార్ట్మెంట్లో నివసించే ఒక వ్యక్తిని సాక్షిగా పిలవమని చెప్పాడు. కొంతసేపటికి అనిత అనే మహిళ అక్కడకు వచ్చింది. అర్షిత గురించి అనితను అడగ్గా.. ఆమె అభ్యంతరకరంగా ప్రవర్తించి కానిస్టేబుల్‌తో గొడవకు దిగారు.
అనంతరం అనిత తన భర్త శ్రవణ్‌కుమార్, సోదరులు నరేశ్, శివ, శేఖర్‌లను పిలిచింది. దీంతో అక్కడకు వచ్చిన వాళ్లు ఏమీ తెలుసుకోకుండానే కానిస్టేబుల్‌ను దూషించి, అతని బట్టలు చింపేసి.. దాడికి దిగారు. తాను కానిస్టేబుల్‌ను అని చెప్పినా వినిపించుకోకుండా బూతులు తిట్టి, కొట్టి గాయపరిచారు. దీంతో సదరు కానిస్టేబుల్ తనపై దాడి చేసిన వ్యక్తులపై మలక్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు పట్టంశెట్టి అనిత, పట్టంశెట్టి శ్రవణ్‌కుమార్, అగనూరి నరేశ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న శివ, శేఖర్ కోసం గాలింపు చేపట్టారు.