కీసర, ఆగస్టు 11: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఒడిశా కూలీలు మృతిచెందారు. కీసర సీఐ ఆంజనేయులు కథనం ప్రకారం .. ఒడిశాకు చెందిన నారాయణ (28), చెక్మోహన్ (24), జైరామ్ (32) వీరు ముగ్గురు ఔటర్ రింగ్ రోడ్డుపై శానిటేషన్ వర్కర్స్గా సోమవారమే విధుల్లో చేరారు. ఈ ముగ్గురు కార్మికులు కీసర ఔటర్ రింగ్ రోడ్డు మీద చెట్లకు నీళ్లు పోస్తున్నారు.
ఈ క్రమంలో మధ్యాహ్నం గాజువాక నుంచి సెల్ఫోన్ టవర్ సామగ్రితో ఘట్కేసర్ మీదుగా అతివేగంగా వచ్చిన వాహనం.. ఈ ముగ్గురు కూలీలను ఢీకొట్టడంతో వీరు అక్కడికక్కడే మృతిచెందారు. 108 సిబ్బంది, కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. శవాలను పంచునామా చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు. కేసును కీసర పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.