హైదరాబాద్: హైదరాబాద్లోని కుషాయిగూడలో (Kushaiguda) భారీ అగ్నిప్రమాదం జరిగింది. కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో (Timber depot) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి (Fire accident). క్రమంగా అవి డిపో మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. మంటలు పక్కనే ఉన్న భవనానికి మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న దంపతులు సహా ఒక బాబు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మూడు మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది వెలికి తీశారు. కనిపించకుండా పోయిన మరో చిన్నారి కోసం గాలిస్తున్నారు. మృతులను నల్లగొండ జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్ (35), సుమ (28), జోషిత్ (8)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.