సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో కాల్పులు జరిగి మూడు రోజులవుతున్నా దోపిడీ దొంగలు ఇంత వరకు పోలీసులకు చిక్కకుండా సవాల్ విసురుతున్నారు. అసలు పేర్లు చెప్పలేదు. ఫోన్లు వాడలేదు. రెక్కీ నిర్వహించారు. బీదర్‌లో దోపిడీ చేసి.. హైదరాబాద్ మీదుగా పరారవ్వడానికి పథకం పన్నారు. అయితే, హైదరాబాద్‌లో కాల్పులు జరగడంతో ఇప్పుడు వారు కర్నాటక పోలీసులకు మాత్రమే కాకుండా హైదరాబాద్ పోలీసులకు కూడా మోస్ట్ వాంటెడ్‌గా మారారు. ఇలాంటి సంచలనాత్మక కేసుల్లో దూకుడు ప్రదర్శించి కేవలం గంటల్లోనే దొంగలను పట్టుకుంటారనే పేరున్న హైదరాబాద్ పోలీసులు కూడా చిక్కుముడి వీడక తల పట్టుకుంటున్నారు.
దోపిడీ దొంగల ఆచూకీ చిక్కినట్లే అనిపించినా ఆ మరుక్షణంలోనే..అక్కడ ఎవరూ లేరని తేలుతున్నది. 10 బృందాలతో గాలింపు చేపట్టిన నగర పోలీసులు ఒకో రూట్లో ఒకో బృందం దొంగల కోసం వెతుకుతుంది. బీదర్‌లో ఏటీఎం దోపిడీ చేసి కాల్పులు జరిపిన దుండగులు హైదరాబాద్‌కు వచ్చి అఫ్జల్‌గంజ్ నుంచి రాయ్‌పూర్ వెళ్లేందుకు రోషన్ ట్రావెల్స్‌లో అమిత్‌కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకొని, యూపీకి చెందిన ఫోన్ నెంబర్‌ను ఇచ్చారు. అయితే ఈ అమిత్‌కుమార్ పేరుతో పాటు ఫోన్ నెంబర్ కూడా తప్పేనని పోలీసుల విచారణలో బయటపడింది. కొత్తగా దోపిడీ దొంగల ముఠా నాయకుడి పేరు మనీష్ అంటూ శనివారం మరో పేరు తెరపైకి వచ్చింది.
సీసీ కెమెరాలలో అనుమానితుల ఫోటోలు సేకరిస్తూ వాటిని విశ్లేషిస్తూ గాలింపులో రంగంలోకి దిగిన పోలీసులు ముందుకు సాగుతున్నారు. దుండగులు ఫోన్ వాడలేదని భావిస్తున్నా, ఎక్కడో ఓ దగ్గర వాడేందుకు అవకావాలు లేకపోలేదనే అనుమానంతో అఫ్జల్‌గంజ్ ప్రాంతంతో పాటు సికింద్రాబాద్ ప్రాంతంలోని సెల్‌ఫోన్ టవర్ల డంప్‌ను కూడా విశ్లేషిస్తున్నారు. కాగా బీదర్‌లో ఏటీఎం సిబ్బందిపై తుపాకీ కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన దోపిడీ ముఠా పాత నేరస్థులని పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పక్కాగా రెక్కీ నిర్వహించి ఈ దోపిడీకి పాల్పడిన ముఠాకు హైదరాబాద్‌పై అవగాహన ఉండడంతో ఇటు నుంచి రాయ్‌పూర్ వెళ్లేందుకు వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని రూట్లపై కొంత అవగాహన ఉండడంతో తికమక లేకుండా నేరుగా సికింద్రాబాద్ వైపు వెళ్లి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.