శామీర్పేట: ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలు తీసింది. సరదాగా అడుకునేందుకు వెళ్లి.. చెరువులో దిగి..ఈత రాక మునిగిపోయారు. అయితే కొందరు చెరువులో చేపల కోసం గాలం వేయగా, ఓ బాలుడి మృతదేహం బయటపడింది. పరిసరాల్లో మిగతా ఇద్దరి మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కొల్తూర్లో చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం..కొల్తూర్ గ్రామానికి చెందిన బాలేకర్ బాలేశ్ కుమారుడు మణిహర్ష(12) 7వ తరగతి, సలేంద్రి కనకరాజు, లావణ్య దంపతుల కుమారుడు హర్షవర్ధన్(10) 6వ తరగతి, వీరబోయిన శోభ, స్వామి దంపతుల కుమారుడు మనోజ్ (11) 6వ తరగతి చదువుతున్నారు. వేర్వేరు స్కూళ్లలో చదువుతున్న వీరంతా గ్రామంలోని యాదవ కాలనీలో నివాసముంటున్నారు. పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో శుక్రవారం ఉదయం సరదాగా ఆడుకునేందుకు ముగ్గురు కలిసి గ్రామ పెద్ద చెరువు వద్దకు వెళ్లారు. ఒడ్డున కొద్దిసేపు ఆడుకున్న అనంతరం చెరువులోకి దిగారు. ఈత రాక మునిగిపోయారు. చెరువు పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం ఎలా జరిగిందో తెలియలేదు.
విద్యార్థులు నీటి మునిగిపోయిన కొద్ది సేపటికి గ్రామానికి చెందిన కొందరు చేపలు పట్టడానికి చెరువు వద్దకు వెళ్లారు. గాలం వేసినప్పుడు నీటి మునిగిన ఓ బాలుడి దుస్తులకు గాలం చిక్కుకుంది. గాలానికి చేప పడింది అనుకుని బలంగా లాగగా.. బాలుడి మృతదేహం బయట పడింది. అదే చోట మరో చిన్నారి మృతదేహం లభించింది.
ఈ విషయం గ్రామంలోనికి దావానంలా వ్యాపించడంతో ముగ్గురు కలిసి ఆడుకోవడానికి చెరువు వద్దకు వచ్చినట్టు తేలింది. మూడో చిన్నారి కూడా ఇదే చెరువులో పడి మృతి చెంది ఉంటాడని గాలించగా, అతడి మృతదేహం కూడా లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు చిన్నారుల మృతితో కొల్తూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.