సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): వెస్ట్‌బెంగాల్ కేంద్రంగా నగరంలో నడుస్తున్న డ్రగ్స్ దందా గుట్టును ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.3.50లక్షల విలువ చేసే హెరాయిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. వెస్ట్‌బెంగాల్‌కు చెందిన అజ్మల్ హుస్సేన్, నూర్ ఆజం ఖాన్, ఎస్కే. సూరజ్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కూలీ పనులతో వచ్చిన డబ్బు సరిపోకపోవడంతో డ్రగ్స్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా తమ సొంత రాష్ట్రంలోని మాల్దా ప్రాంతం నుంచి గ్రాము హెరాయిన్‌ను రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేసి, నగరంలో రూ.5000లకు గ్రాము చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు గురువారం శేరిలింగంపల్లి లవ్బోర్న్ కాలనీలో దాడులు జరిపి డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు.
నిందితుల వద్ద నుంచి రూ.3.50 లక్షల విలువ చేసే 70 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ కేసును ఛేదించి, నిందితులను పట్టుకున్న డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ శ్రీకాంత్, నెహ్రూ, గణేశ్, శేఖర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు.