శేరిలింగంపల్లి, జూలై 8: అపార్టుమెంట్లు, హాస్టళ్ల ముందు పార్క్‌చేసి ఉన్న ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ.35 లక్షలు విలువ చేసే 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ జయరాం వివరాలు వెల్లడించారు. ఏపీకి చెందిన దేవకిశోర్ (20) కొండాపూర్‌లో ఉంటూ.. బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన కడియాల వీరవెంకట సత్యనారాయణ (21) గతంలో స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేసి, ప్రస్తుతం కొండాపూర్‌లో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కృష్ణ జిల్లాకు బాలే దిలీప్ (19).. ఈ ముగ్గురు సహా మరో ఇద్దరు మైనర్లతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ఐదుగురు రెండు బృందాలు విడిపోయి.. అపార్టుమెంట్లు, హాస్టళ్ల ముందు పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్రవాహనాలపై రెక్కీ నిర్వహిస్తారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఉన్న వాహనాల హ్యండిల్ లాక్ పగలగొట్టి వెళ్లిపోతారు. కొద్ది సేపటి తర్వాత మరో బృందం వచ్చి సదరు వాహనాన్ని తీసుకొని కొండాపూర్ రాఘవేంద్రకాలనీలోని ఓ గోదాంకు తరలిస్తారు. చోరీ చేసిన వాహనాలకు దేవకిశోర్ నకిలీ కీస్ తయారు చేస్తాడు.
ఈ తరహాలో గత రెండు నెలలుగా గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో 6, కేపీహెచ్‌బీ కాలనీ పీఎస్ పరిధిలో 8, మాదాపూర్, మియాపూర్ పరిధిలో ఒక్కో వాహనం.. మొత్తం 16 ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. చోరీ చేసిన బైక్‌లను గోదాం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రావులపాలెంకు తరలించి విక్రయించేందుకు పథకం రచించారు. రాఘవేంద్రకాలనీలో వాహనాల తనిఖీ చేస్తుండగా.. గచ్చిబౌలి పోలీసులకు దేవకిశోర్ నంబర్ ప్లేట్ లేని వాహనంపై వెళ్తూ పట్టుబడ్డాడు. సరైన పత్రాలు చూపకుండా.. పొంతనలేని సమాధానమివ్వడంతో అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. గోడౌన్ నుంచి రూ.35 లక్షలు విలువ చేసే 16 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులు దేవకిశోర్, సత్యనారాయణ, దిలీప్‌ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు మైనర్లకు నోటీసులిచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్టు మాదాపూర్ ఏడీసీపీ జయరాం తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ సమావేశంలో మాదాపూర్ ఏసీపీ సీహెచ్.శ్రీకాంత్, ఇన్స్పెక్టర్ బి.ఆంజనేయులు, డీఐ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.