సిటీబ్యూరో, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ):నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆబ్కారీ పోలీసులు దాడులు జరిపి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.3.5లక్షల విలువజేసే 5.260 కిలోల గంజాయితో పాటు కారు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సౌజన్య కథనం ప్రకారం.. నిర్మల్ ప్రాంతానికి చెందిన మలావత్ రాజేందర్, ఇండాల్ రాథోడ్ సులువుగా డబ్బు సంపాదించేందుకు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో నిందితులిద్దరూ కలిసి ఆదిలాబాద్ శివారు ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌లో పరిచయమున్న పలువురికి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ డీటీఎఫ్ బృందం బోయినిపల్లి సమీపంలోకి వచ్చిన నిందితుల కారును ఆపి, తనిఖీలు జరుపగా, కారు డిక్కీలో 4.140 కేజీల గంజాయి లభించింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. గతంలో కూడా చాలాసార్లు నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి, నగరంలో విక్రయించినట్లు వెల్లడించారు.
దీంతో నిందితులిద్దరినీ అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 4.140 కేజీల గంజాయితోపాటు కారు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితులను పట్టుకున్న సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సౌజన్యతోపాటు ఎస్ఐ శివకృష్ణ, కానిస్టేబుళ్లు రాజు రవి, సునీత బృందాన్ని సికింద్రాబాద్ ఈఎస్ శ్రీనివాసరావు అభినందించారు.
పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన నారాయణ దారి అనే వ్యక్తి కొండాపూర్ బొటానికిల్ పార్కు పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుపుతున్నాడు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ ఎస్ఐ జ్యోతి తన బృందంతో కలిసి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. అతడి ఇద్ద నుంచి 1.120కిలోల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును శేరీలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.