సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది కూడా విద్యార్థులకు యూనిఫాం సమస్య వెంటాడుతోంది. పాత యూనిఫాంల్లోనే విద్యార్థులు స్కూళ్లకు రావాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఇప్పటికే కొత్త యూనిఫాంల పంపణీ కొనసాగాలి. అయితే ఈ ఏడాది యూనిఫాం విధానంలో మార్పులు చేశారు. దీంతో కొత్త యూనిఫాంలు కుట్టి పంపిణీ చేయాలంటే మరో మూడు నెలల సమయం పట్టనుంది. స్వయం సహాయక బృందాల ద్వారా కుట్టు పనులు కొనసాగుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
పుస్తకాలు, నోట్ బుక్లు సైతం పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలోజూన్లో వంద శాతం పంపిణీ జరగాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 672 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 481 ప్రాథమిక, 182 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సుమారు 8,17,461 మంది విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అయితే అరకొర వసతులే విద్యార్థులకు స్వాగతం పలకడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.