ప్రచారం కోసం కోట్లు కుమ్మరించే రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమాలకు దిగింది. భవన నిర్మాణ అనుమతులను కాలరాసి ఏకంగా చెరువు కట్టను లేపేసేందుకు స్కెచ్ గీసింది. దుండిగల్‌లోని హెచ్ఎండీఏ నోటిఫై చేసిన చెరువు కట్ట, బఫర్ జోన్‌ను వెంచర్ అప్రోచ్ రోడ్డుకు మార్చుకున్నది. ఇదేంటనీ ప్రశ్నిస్తే మాకు హెచ్ఎండీఏ, ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఎన్వోసీలు, భవన నిర్మాణ అనుమతులు ఉన్నాయని కుంటి సాకులు చెబుతోంది. ఇక వ్యవహారం తేలేలా లేదని రెవెన్యూ అధికారులు ఒక్క అడుగు ముందుకేసి చెరువు ఆక్రమణలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటపడింది.
– సిటీబ్యూరో, జూన్ 26(నమస్తే తెలంగాణ)
హైదరాబాద్ కేంద్రంగా ఒకేసారి ఐదారు ప్రాజెక్టులను చేపట్టిన కాసా గ్రాండ్ నిర్మాణ సంస్థ..నార్త్ సిటీ కేంద్రంగా బహుళ సంఖ్యలో లగ్జరీ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. లగ్జరీ విల్లాలు, అపార్టుమెంట్లతో పదుల ఎకరాల భారీ నిర్మాణాన్ని తీర్చిదిద్దుతోంది.అయితే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్-గండిమైసమ్మ మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామ పరిధిలో ఉన్న కోతినార్ చెరువు సమీపంలో భారీ లగ్జరీ విల్లా ప్రాజెక్టులను కాసా గ్రాండ్ సియోరా పేరిట నిర్మిస్తోంది. అయితే ప్రాజెక్టుకు అవసరమైన అప్రోచ్ రోడ్డు కో సం ఏకంగా చెరువు భూమిని చెరబట్టింది.
అధికారికంగా హెచ్ఎండీఏ అనుమతుల కోసం సమర్పించిన లే అవుట్లో ఎలాంటి అప్రోచ్ రోడ్డును చూపని నిర్వాహకులు… ప్రాజెక్టును ఆనుకుని ఉన్న కట్టను విస్తరించి దర్జాగా బీటీ రోడ్డు పరుచుకున్నది. ఇదే తమ ప్రాజెక్టుకు గ్రాండ్ ఫోర్ వే హైవే అని కస్టమర్లను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన అత్యంత కీలకమైన చెరువు ఎకాలజికల్ బఫర్ జోన్‌ను కూడా నిర్వీర్యం చేసిన కాసా గ్రాండ్ సంస్థ.. ఆక్రమణలతో ప్లాట్లు వేసినట్లుగా జాయింట్ సర్వేలో తేలింది.
అక్రమాలపై రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయడంతో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేయడంతో… లే అవుట్లో కట్ట నుంచి రోడ్డుకు అనుమతి లేదని, ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగిందని తేల్చారు. దుండిగల్ తహసీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ పరిధిలోని దుండిగల్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే అధికారులు నోటీసులిస్తే.. తమ వద్ద ఇరిగేషన్ ఎన్వోసీ, హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నాయని బుకాయించింది.
కొనుగోలుదారులను నిండా ముంచేందుకు సిద్ధమైన కాసా గ్రాండ్.. ప్రచార ఆర్భాటంతో , అక్రమాలకు తెరలేపి, ఏకంగా చెరువు కట్టను మాయం చేసి ంది. అయితే ఇదే విషయంలో అటు కాసా గ్రాండ్ నిర్వాహకులను ‘నమస్తే’ సంప్రదించగా.. ఈ విషయం లో మాట్లాడానికి విముఖత వ్యక్తం చేశారు. ఎమ్మార్వో రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ చెరువు కట్ట విషయంలో కాసా గ్రాండ్ నిర్మాణ సంస్థకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. నిర్ణీత గడువులోగా నిర్మాణ సంస్థ స్పందించకపోతే.. అనుమతులు రద్దు చేయాలని హెచ్ఎండీఏను కోరుతామన్నారు. కాగా, అప్రోచ్ రోడ్డు విషయంలో హెచ్ఎండీఏ అనుమతులు ఎలా ఇచ్చిందనేది పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.