ఖైరతాబాద్, సెప్టెంబర్ 15 : వర్షాకాలంలో భారీ వర్షాలకు నాలా పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ప్రతి ఏడాది ఎండాకాలంలోనే నాలాల పూడికతీత కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరవుతాయి. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఆ పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఖైరతాబాద్ సర్కిల్లో అందుకు భిన్నంగా వ్యవహారం నడుస్తోంది.
సర్కిల్లో నాలాల విస్తీర్ణం ఇతర సర్కిళ్ల కంటే అదనంగా ఉంటుంది. ప్రధాన రహదారుల మీదుగా నాలాలను నిర్మించడంతో ఏ ఒక్క చిన్న అవాంతరం ఏర్పడినా ముంపునకు గురవుతుంది. అయితే ఈ సారి పూడికతీత పనుల్లో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది నాలాల డీసిల్టింగ్ కోసం సర్కిళ్ల వారీగా కోట్లాది రూపాయల నిధులు మంజూరవుతాయి. ఈ ఏడాది ఆ నిధుల మాట అటుంచితే నాలాల పూడిక తీతకు రూ.80లక్షలతో మళ్లీ కొత్త టెండర్లను ఆహ్వానించడంతో ఇంజినీరింగ్ శాఖ పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎప్పుడూ ముంపే….
సర్కిల్ పరిధిలో నాలాలన్నీ వర్షాకాలంలో కాలనీలను ముంచెత్తుతాయి. ముఖ్యంగా బుల్కాపూర్ నాలా ప్రతి వర్షానికి ముంపునకు గురవుతూ ఉంటుంది. ఈ ఏడాది జూన్ నెల నుంచి ప్రతి నెలా కుండపోత వర్షాలు కురిశాయి. సోమవారం కురిసిన భారీ వర్షానికి సైతం తుమ్మలబస్తీ ప్రాంతంలో బుల్కాపూర్ నాలా పొంగి పొర్లడంతో ఆ బస్తీ ముంపునకు గురైంది. ఈ నాలా బంజారాహిల్స్ రోడ్ నం. 1/12 నుంచి ప్రవహిస్తూ చింతలబస్తీ, తుమ్మలబస్తీ మీదుగా రాజ్‌నగర్ నుంచి ఎస్టీపీలో కలుస్తుంది. పూడితతీత కోసం మంజూరైన నిధులతో ఈ నాలాను పూడిక తీసేందుకు ప్రొైక్లెనర్ను కూడా ఏర్పాటు చేశారు.
అయితే భారీ వర్షానికి వరద ముంపులో అది కూడా మునిగిపోవడంతో మూలనపడింది. అలాగే బంజారాహిల్స్‌లోని దేవరకొండ బస్తీ నుంచి వచ్చే నాలా మోడల్ హౌస్ మీదుగా జాఫర్అలీ బాగ్, రాజ్‌భవన్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తూ ఎస్టీపీకి చేరుతుంది. ఈ నాలాపై ఎక్కువగా భారీ నిర్మాణాలు ఉన్నాయి. జాఫర్ అలీ బాగ్‌లో 2 సంవత్సరాలుగా పూడిక తీయకపోవడంతో అందులోభారీగా వృక్షాలు సైతం పెరిగాయి. ఈ నాలా కుంచించుకుపోవడంతో పాటు పూడికతీయకపోవడంతో దేవర కొండ బస్తీ ముంపునకు గురవుతూ వస్తోంది. సర్కిల్లో నాలాల పూడికతీతకు మంజూరైన నిధులు ఎటుపోయాయో బల్దియా అధికారులకే తెలియాలంటున్నారు స్థానికులు.
ఎనిమిదేండ్లుగా బదిలీలు లేవు
ఖైరతాబాద్ జోనల్ పరిధిలో సర్కిల్ 17లో పనిచేసే ఇద్దరు ఇంజినీరింగ్ విభాగం అధికారులు గత ఎనిమిదేండ్లుగా ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది ఖైరతాబాద్ సర్కిల్‌కు నాలా డీసిల్టింగ్ కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరవుతుంటాయి. ఖైరతాబాద్ సర్కిల్ డీఈ, ఏఈలు ఎనిమిదేండ్లుగా ఇదే సర్కిల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆ ఇద్దరు అధికారుల పర్యవేక్షణలోనే నాలాల పూడికతీత పనులు జరుగాల్సి ఉంటుంది.
కానీ వారి పనితీరుతో ఇక్కడనాలా పరీవాహక ప్రాంతాల్లో వరదముంపు తీరని సమస్యగా మిగిలిపోయింది. సర్కిల్- 17లో గడిచిన ఎనిమిదేండ్లలో ఎందరో డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఏఎంవోహెచ్‌లు మారారు. ఇంజినీరింగ్ విభాగంలోని ఈఈ, ఇతర అధికారులు సైతం బదిలీ అయ్యారు. ప్రతి 2-3సంవత్సరాలకోసారి అధికారికంగా బదిలీల ప్రక్రియ కొనసాగుతుంటుంది.
కానీ సర్కిల్ డీఈ, ఏఈలు మాత్రం బదిలీ కాకుండా ఇక్కడే తిష్టవేసి ఉండడంతో పాటు బల్దియా కమిషనర్, ఉన్నతాధికారులు సైతం ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడంపైప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరికి సచివాలయంలోని పెద్దల అభయహస్తం ఉండడం వల్లే బదిలీల నుంచి తప్పించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.