బంజారాహిల్స్,జనవరి 20 : సంక్రాంతి పండుగ కోసం ఊరెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని అరోరా కాలనీలో నివాసం ఉంటున్న మౌనిక, శ్రీధర్ దంపతులు ఈనెల 8న సంక్రాంతి పండుగ కోసం ఇంటికి తాళం వేసి పశ్చిమగోదావరి జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లారు. కాగా సమీపంలోనే ఉంటున్న మౌనిక సోదరుడు విజయ్ ముకేష్ ఈనెల 14న సోదరి ఇంటికి వెళ్లి కొన్ని కిరాణా సామాన్లు తీసుకుని వెళ్లాడు.
కాగా ఈనెల 19న తన సోదరి ఇంటికి విజయ్ ముఖేష్ వెళ్లిచూడగా మెయిన్ డోర్ తాళాలు పగలగొట్టబడి కనిపించాయి. లోపలికి వెళ్లగా అల్మారాలోని వస్తువులు చిందరవందరగా పడ్డట్లు గుర్తించాడు. అల్మారాలో ఉండాల్సిన 20గ్రాముల బంగారు బ్రాస్లెట్, నల్లపూసల గొలుసు, చిన్నపిల్లల గొలుసులు, ఉంగరాలు, వెండి వస్తువులతో పాటు రూ.64వేల నగదు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు విజయ్ ముఖేష్ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.