Hyderabad | చార్మినార్, జూలై 10: ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో నగరానికి చేరి నిర్మాణ పనుల్లో కుదిరిపోయాడు. అక్కడ వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఇల్లు దోచేయడం ప్రవృత్తిగా మార్చుకుకుని తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్నా ఓ దొంగను సౌత్ వెస్ట్ టాస్క్ పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదనపు డీసీపీ అందే శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ వడ్డేపల్లికి చెందిన జగన్నాధ ప్రభు కొంత కాలం క్రితం నగరానికి వచ్చి ఉప్పర్‌పల్లిలో నివసిస్తున్నాడు. జీవనాధారం కోసం నిర్మాణ రంగంలో మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అక్కడ వచ్చే ఆదాయం సరిపోక పోవడంతో చోరీల బాట పట్టాడు. పగటి సమయంలో తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తూ రెక్కీ నిర్వహించేవాడు. రాత్రి సమయంలో తాళలను బ్రేక్ చేస్తూ ఇళ్లను గుల్ల చేస్తున్నాడు.
జగన్నాధం ప్రభును చోరీ కేసులో గత మే నెలలో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన జగన్నాథ్ ప్రభు ఎల్బీ నగర్, ఉప్పల్, మైలార్‌దేవ్‌పల్లిలో చోరీలకు పాల్పడ్డాడు. దోపిడిలో దొంగిలించిన బంగారాన్ని పలు ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి నగదుగా మార్చుకునేవాడని పోలీసులు విచారణలో తేలింది. వరుస దొంగతనాలపై నిఘా పెట్టిన సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎల్బీనగర్ పోలీసులతో కలిసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని వద్ద నుండి రూ. 31 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమ్మిత్తం ఎల్బీ నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మీడియా సమావేశంలో సౌత్ వెస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్‌తోపాటు ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, ఎస్ఐ విజయానంద్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.