సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారుల సమన్వయ లోపంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని, రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఔట్సోర్సింగ్ డ్రైవర్లు మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్టు విభాగంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన ఈవీడీఎం విభాగంలో డ్రైవర్లుగా పనిచేసే తమను హైడ్రాకు బదిలీ చేశారని, హైడ్రా అధికారులు తమను డ్రైవర్ వృత్తి కాకుండా పార్కుల్లో సెక్యూరిటీ సిబ్బందిగా వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందులో కొందరిని హైడ్రా తీసుకోకుండా తిరిగి జీహెచ్ఎంసీకి పంపించిందని ఆరోపించారు. ఈ రెండు శాఖల సమన్వయ లోపంతో నలిగిపోతున్నామన్నారు. జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కుటుంబ పోషణ కూడా భారవుతుందని , ఇంటి రెంట్లు కూడా కట్టలేని స్థితిలో ఉన్నామని వాపోయారు. కమిషనర్ జోక్యం చేసుకోవాలని, లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.