వనస్థలిపురం/అల్వాల్, ఫిబ్రవరి 7 : వనస్థలిపురంలో బుధవారం ఓ వ్యక్తి కండ్లలో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. సాహెబ్‌నగర్ పద్మావతి కాలనీకి చెందిన గోవర్ధన్ స్థానికంగా కిరాణషాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం పాల ప్యాకెట్లు తీసుకువస్తుండగా, వీరాంజనేయ కాలనీ సమీపంలోకి రాగానే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. అందులో ఒకరు కిందికి దిగి గోవర్ధన్ కండ్లలో కారం కొట్టి, మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. గోవర్ధన్ దుండగులను పట్టుకునేందుకు బైక్‌పై వెంబడించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లో చొరబడి.. : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాటియా బేకరి సమీపంలోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి శైలజ (36) అనే మహిళ కండ్లలో కారం చల్లి.. ఆమె మెడలోని 2 తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సమీపంలో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని దొంగలు అనువుగా తీసుకున్నట్లు భావిస్తున్నారు.