రవీంద్రభారతి, డిసెంబర్ 29 : నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్‌లో స్టాల్స్ ఎంపిక అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని పలువురు స్టాల్స్ నిర్వాహకులు డిమాండ్ చేశారు. సోమవారం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టాల్స్ నిర్వాహకులు అక్బర్అలీ, గాంధీదర్శన్, కార్యదర్శి ప్రసాద్‌తో కలిసి జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నర్సయ్య మాట్లాడారు. నుమాయిష్‌లో మొత్తం 3 వేలకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తే, అధికారికంగా 2 వేల స్టాల్స్ మాత్రమే చూపిస్తున్నారని తెలిపారు.
మిగిలిన 15 వందల స్టాల్స్‌ను ఏ పద్ధతిలో కేటాయిస్తున్నారో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సొసైటీ లెక్కల ప్రకారం మినిమం స్టాల్‌కు లక్ష రూపాయల రెంట్ ఉంటుందని, కానీ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు అదనంగా రెండు నుంచి 3 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గతేడాది సొసైటీ కన్వీనర్, ప్రస్తుత స్టాల్స్ అలట్మెంట్ అడ్వైజర్ ప్రభ శంకర్ కనుసన్నల్లోనే అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం స్టా ల్స్ కేటాయింపుపై ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలని..అప్పుడే సొసైటీ చేస్తున్న అక్రమాలు బయటపడుతాయన్నారు. గోషామహల్‌లోని నిరుద్యోగులు, యువతకు స్టాల్స్ కేటాయించాలని, ఈ విషయం మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.