రవీంద్రభారతి, ఆగస్టు14: ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాలిపిస్తామని, ఆ తర్వాత 6 నెలలకే పర్మినెంట్ చేస్తారని తప్పుడు ఆర్డర్ కాపీలతో నమ్మించి, రూ.కోటి 40 లక్షలు కాజేసిన కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బాధితులు కె.నాగరాజు, ఎన్.విజయ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ..
కరీంనగర్‌కు చెందిన బిజ్జిగిరి శ్రీనివాస్, అతని స్నేహితుడు అబ్బోజు శ్రీనివాస్, అతని చెల్లెలు బొజ్జిగిరి శ్యామల (ఆరోగ్యశాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది).. కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాలిప్పిస్తామని తమను నమ్మించారని తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రాంగోపాల్‌పేటలోని సింధికాలనీలో అభ్యుదయ పబ్లికేషన్స్‌లో 2019 సెప్టెంబర్ నుంచి 2020 జనవరి 16 వరకు.. 16 మందికి ఉద్యోగ శిక్షణ ఇచ్చారని తెలిపారు.
శిక్షణకాలంలో నెలకు ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పున ైస్టెఫండ్ను అకౌంట్లో జమ చేశారని వివరించారు. అప్పటికే తాము రూ.40 లక్షల చొప్పున అతనికి, బిజ్జిగిరి శ్రీనివాస్ భార్య బుజ్జిగిరి కోమలకు ఇచ్చామని తెలిపారు. మొత్తం 23 మంది బాధితుల దగ్గర నుంచి కోటి 40 లక్షలు విలువైన నగదులో కొంత బ్యాంక్ అకౌంట్ ద్వారా, మరికొంత నగదును శ్యామలకు అప్పగించామని తెలిపారు. అప్పటిదాకా తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశతోనే ఉన్నామని తెలిపారు.
కానీ చివరకు ఉద్యోగ ఆర్డర్‌కాపీ నకిలీదని తేలిందన్నారు. తాము మోసం పోయామని గ్రహించి 2024 జూలై 5న రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. తమ ఫిర్యాదులపై గట్టిగా పోలీసులను నిలదీస్తే పోలీసులు తమపైనే కేసులు పెడుతామని బెదిరించారని వాపోయారు. మేము గట్టిగా పట్టుబట్టడంతో నిందితులపై కేసు నమోదు చేశారని కాని ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్నారు. నేరస్తులపై సిట్ విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.