బంజారాహిల్స్,జనవరి 20: చంటిబిడ్డ ఆలనాపాలన చూసేందుకు ఆయాను పంపిస్తామంటూ ఆన్లైన్లో ప్రకటన ద్వారా మోసం చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని క్రిషీ వ్యాలీలో నివాసం ఉంటున్న ప్రియాంక గుప్తా అనే మహిళ తన చంటిబిడ్డను చూసుకునేందుకు ఆయా కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ కేర్ ఎక్స్పర్ట్స్ పేరుతో ఓ ప్రకటన కనిపించింది.
దానిలోని నెంబర్కు ఫోన్ చేయగా టెండర్ కేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జంగమ్గారి కీర్తిరెడ్డి అనే మహిళ తాము ఆయాను సమకూరుస్తామని, రూ.34999 చెల్లించాలని కోరింది. తమ సేవలు నచ్చకపోతే డబ్బులు వెనక్కి ఇస్తామంటూ చెప్పింది. అయితే డబ్బులు చెల్లించిన తర్వాత ఆయాను పంపించకపోగా ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధిత మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.