అడ్డగుట్ట, మార్చి 2: నాలుగు నెలలుగా వ్యాపారాలు లేక ఆర్థిక భారాన్ని మోస్తున్నాం.. అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాం… కనీసం రంజాన్ మాసంలోనైనా మమ్మల్ని వీధి వ్యాపారాలు నిర్వహించుకోనివ్వండని లాలాగూడ స్ట్రీట్ వెండర్స్ చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు. రంజాన్ నెల ప్రారంభమైన నేపథ్యంలో ఆదివారం లాలాగూడ న్యూ బ్రిడ్జి వద్ద స్ట్రీట్ వెండర్స్ పండ్ల వ్యాపారాలను ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న చిలకలగూడ ట్రాఫిక్, ఆర్పీఎఫ్ పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న బండ్లను తొలగించారు.
దీంతో స్ట్రీట్ వెండర్స్ తమకు రంజాన్ నెలలోనైనా వ్యాపారాలను నిర్వహించుకునేందుకు వెసులు బాటు కల్పించాలని ట్రాఫిక్ పోలీసులను కోరారు. అయినా కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా బండ్లను పూర్తిగా తొలగించారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు నిర్వహించుకుంటున్న లాలాగూడలో మాత్రం పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కుటుంబ పోషణ కష్టమై ఇప్పటికే చాలావరకు అప్పులు చేశామని, ఇకనైనా చిలకల గూడ ట్రాఫిక్ పోలీసులు తమ పరిస్థితులను అర్థం చేసుకొని వ్యాపారాలను నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించాలని చిరు వ్యాపారి మహమ్మద్ నిజాముద్దీన్ కోరారు.