Gunfire | కుత్బుల్లాపూర్, ఆగస్టు 29 : గాజులరామారంలో రెండు రోజల కిందట తుపాకీతో గాలిలో కాల్పులు జరిపిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి గాజులరామారంలోని ఎల్ఎన్ బార్ వద్ద ఓ మహిళ ద్విచక్ర వాహనంలో పెట్రోల్ అయిపోయింది. ఇతర వాహనంలోనుంచి పెట్రోల్ తీస్తుండగా.. బార్లో పనిచేసే సిబ్బంది గమనించి వారిపై దాడి చేశారు. దీంతో మల్లంపేటకు చెందిన రియాల్టర్ నరేశ్, తన అనుచరులతో కలిసి అక్కడికి వచ్చి నాటు తుపాకీతో గాలిలో మూడు రౌండ్ల కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో అదేరోజు రాత్రి ఇరువర్గాలు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించారే తప్పా.. నరేశ్ తుపాకీ వాడకం పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన పోలీసులు.. నరేశ్ తప్పించుకున్నాడని చెప్పడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యక్తి అనుమతిలేని తుపాకీ వినియోగించడంతో పాటు కాల్పులు జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టకుండా.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. నరేశ్ స్నేహితుడైన శివ నాటు తుపాకీతో గురువారం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవడం ప్రశ్నార్థకంగా మారింది. నరేశ్ గాలిలో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడని ఘటన జరిగిన రోజు పోలీసులు చెప్పారు. తాజాగా, నరేశ్‌కు బదులుగా శివ తానే కాల్పులు జరిపానంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇప్పటి వరకు నరేశ్ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉండటం గమనార్హం. నాటు తుపాకీతో పాటు మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితుడు నరేశ్ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
పలు వివాదాల్లో నరేశ్..
రియాల్టర్ నరేశ్ గతంలో కూడా భూతగాదాలు, ఇతర వ్యవహారాల్లో నాటు తుపాకీతో బెదిరింపులకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. అతడికి బీహారీ గ్యాంగ్‌లతో సైతం పరిచయాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి అనుమతి లేని నాటు తుపాకీతో రియాల్టర్ నరేశ్ గతంలో ఏయే ఘటనలకు పాల్పడ్డాడు.. తుపాకీ వాడాల్సిన అవసరం అతడికి ఏమున్నది.. అని పలువురు మాట్లాడుకోవడం వినిపించింది. పోలీసుల వద్దకు వచ్చిన నరేశ్‌ను చాకచక్యంగా పంపడం.. ఆ తర్వాత ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టడం వెనుక పోలీసులే కావాలని నరేశ్‌ను తప్పించారా..! లేదంటే నరేశ్ తప్పించుకున్నాడా.! అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పోలీసులను ఆరా తీయగా.. నరేశ్ కోసం పలు పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెబుతున్నారు.