సిటీబ్యూరో/కార్వాన్, అక్టోబర్1 (నమస్తే తెలంగాణ) : మూసీ నిర్వాసితుల ఇండ్లను కూల్చడానికి రేవంత్ సర్కార్ మొదట్నుంచి ప్రణాళికలు వేసింది. మరి ఆ నిర్మాణాలను కూల్చితే నిర్వాసితుల బతుకులు ఏం గావాలే అనే విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వారికి డబుల్ బెడ్ రూంలు కేటాయించాలనుకుంటే అందులో అవసరమైన అన్నీ వసతులు ఉన్నాయా? లేవా? అని పరిశీలించి అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ కేవలం కూల్చివేతలే లక్ష్యంగా అభాగ్యుల బతుకు బుగ్గిపాలు చేస్తున్నది.
ఇష్టమొచ్చినట్టు కొందరిని బెదిరించి డబుల్ బెడ్ రూంలకు బలవంతంగా తరలిస్తున్నారు. ఉన్న ఇల్లును వదిలేసి ఆ డబుల్ బెడ్ రూంలో అడుగుపెడితే సమస్యలే ఆహ్వానం పలుకుతున్నట్టుగా అందులోని పరిస్థితులు ఉన్నాయని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “కరెంట్ రావడం లేదు. నీళ్లు బంద్ అయినయ్. ఎవ్వరిని అడగాలో తెలియదు. లిఫ్ట్ పనిచేయడం లేదు. ఆపరేషన్ చేసుకున్న వారు, వృద్ధులూ ఉన్నారు. వారికి 6, 7 అంతస్తుల్లో ఇండ్లు కేటాయించి అధికారులు చేతులు దులుపుకున్నారు.” అంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, 163 మంది మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూంలు కేటాయించినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు.
డబుల్ బెడ్రూంలో వసతులు లేవు
మా ఇల్లు కూల్చేసి చంచల్గూడలోని పిల్లిగుడిసెల్లో డబుల్ బెడ్రూం సముదాయంలో ఏడో అంతస్తులో ఇల్లు ఇచ్చారు. అక్కడ ఎలాంటి వసతులు, నీళ్లు, కరెంట్ లేదు.. లిఫ్ట్ బంద్‌చేశారు. సామాన్లు ఏడు అంతస్తుల పైకి మోసుకెళ్లాలంటే ఎంత ఇబ్బంది అవుతది. సామాన్లు తీసుకెళ్లడానికి లిఫ్ట్ వాడితే కరెంట్ బిల్లు ఎక్కువస్తదని బంద్ చేశారు. ఎన్నో ఏండ్లనుంచి ఇక్కడ ఉన్నంతలో మేం సుఖంగా ఉంటున్నాం. సరైన వసతులు కల్పించకుండా ఇండ్లు ఇచ్చారు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు.
– షబానా(బాధితురాలు శంకర్‌నగర్)
ఇప్పుడున్నోళ్లకే నీళ్లు సరిపోతలేవు.. కొత్త వారొస్తే ఎలా..
జియాగూడలో నేను పాత క్వార్టర్ల కాలం నుంచి నివసిస్తున్నా. డబుల్ బెడ్రూం నిర్మాణం సమయంలో కొన్ని రోజులు బయట కిరాయికి ఉన్నాం. తిరిగి కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూంలోకి వెళ్లాం. అయితే గతంలో 540 కుటుంబాలు మాత్రమే నివాసం ఉండేవారు. కొత్తగా 300 డబుల్ బెడ్రూంలు అదనంగా నిర్మించి ఇప్పడు కొత్త వాళ్లకు ఇస్తున్నారు. కాగా పాత వారికే సరైన నీటి సదుపాయం, లిఫ్ట్ సౌకర్యం లేకపోగా పలు సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు మరో 300 డబుల్ బెడ్రూంలు కేటాయిస్తే పెరిగేపోయే జనాభాకు అనుగుణంగా నీటి సౌకర్యం, కరెంట్ సరఫరా, లిఫ్ట్‌తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలి. లేకపోతే ఈ డబుల్ బెడ్రూంలలో నివసించడం కష్టమే.
– నాగేశ్, డబుల్ బెడ్రూం నివాసి.
సౌకర్యాలు కల్పించి.. కొత్త వాళ్లకు ఇవ్వాలి
జియాగూడలోని డబుల్ బెడ్రూంలలో ఇప్పటికే నివాసం ఉంటున్న వారికి సరైన సదుపాయాలు లేవు. నీటి కొరత, నీటి సంపు సమస్య, లిఫ్ట్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. సమస్యల పరిష్కారంపై అధికారులకు దృష్టికి తీసుకెళ్తే.. పట్టించుకోవడం లేదు. డబుల్ బెడ్రూం భవనంలో ఉన్న సమస్యలను తీర్చి కొత్తగా వచ్చే వారికి కూడా సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి. మరో రెండు నీటి సంపులు నిర్మించాలి. లిఫ్ట్ సౌకర్యం కల్పించాలి. సౌకర్యాలు కల్పించకుండా కొత్తవారికి ఇండ్లు కేటాయించినా ఎలాంటి ప్రయోజనం లేదు.
– జియాగూడ డబుల్ బెడ్రూం వాసులు