శేరి లింగంపల్లి, జనవరి 7: బ్రహ్మ కుమారీస్ సంస్థపై సోషల్ మీడియా, యూ ట్యూబ్ వేదికగా వస్తున్న వార్తలు, ఆరోపణల్లో వాస్తవం లేదని తమ సంస్థ సనాతన ధర్మ సంరక్షణకు ఎల్లప్పుడు పాటుపడుతుందని గచ్చిబౌలిలోని ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శాంతి సరోవర్ డైరక్టర్ కులదీప్ బెహన్ అన్నారు. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బ్రహ్మ కుమారీస్పై వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని, తప్పుడు ఆరోపణలతో తమపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేవలం ఏదో ఒక నెగటీవ్ న్యూస్‌తో ప్రజల్లో వైరల్ కావాలనే లక్ష్యంతో కొందరు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
నెగటివ్ వార్తలపై ప్రజలు అధిక ఆసక్తిని కనబరుస్తున్న ప్రస్తుత తరుణంలో, దానిని ఆసరాగా చేసుకొని కొందరు తప్పుడు సమాచారం, కథనాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తూ బ్రహ్మ కుమారీస్పై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతంగా పాజిటీవ్ న్యూస్‌తో మనమందరం ముందుసాగాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సభ్యులతో 140 దేశాల్లో బ్రహ్మ కుమారీస్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నదన్నారు. హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య, ప్రముఖ న్యాయవాది జయకృష్ణలు ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్రహ్మ కుమారీస్ సంస్థపై తప్పుడు కథనాలు, ఆరోపణలు, దుష్ప్రచారంపై ఈ నెల 6న హైకోర్టును ఆశ్రయించినట్టు పేర్కొన్నారు.
ఈ మేరకు హైకోర్టు సదరు వీడియోలను వెంటనే యూ ట్యూబ్, గూగుల్ల నుంచి తొలగించాలని ఆయా సంస్థలకు ఆదేశాలిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపారు. బ్రహ్మ కుమారీస్పై దుష్ప్రచారం చేస్తున్న కూకట్‌పల్లికి చెందిన యూ ట్యూబర్ లలిత్ కుమార్, మణికొండ ప్రాంతానికి చెందిన మహిళ వనితా మైథిలీలపై తెలంగాణలోని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్, గచ్చిబౌలి పోలీస్స్టేషన్లలో ఈ నెల 25న, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలోని సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో గత డిసెంబర్ 12న ఫిర్యాదులు చేశామని, వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయన్నారు. బ్రహ్మ కుమారీ ఉమారాణి, సరళ బెహన్లతో పాటు పలువురు బ్రహ్మ కుమారీస్ ప్రముఖులు, బ్రహ్మ కుమారీస్ సభ్యుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.