సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనసభ -2023 ఎన్నికల విధుల్లో పాలుపంచుకున్న కాంట్రాక్టర్ల గోడు వినేవారే కరువయ్యారు. ఎన్నికలు ముగిసి రెండేళ్లు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో పనులు పూర్తిచేసిన తమకు చెల్లింపులు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు 214 మంది కాంట్రాక్టర్ల గ్రూపునకు సంబంధించిన రూ.8,08,17,135 పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంగళవారం తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటిసాయి కిరణ్ ఆధ్వర్యంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్‌ను కలిసి కాంట్రాక్టర్లు వినతిపత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన స్పెషల్ ఆఫీసర్.. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌తో మాట్లాడి తగిన న్యాయం చేస్తానని కాంట్రాక్టర్లకు హామీమి ఇచ్చారు.
కోర్టుకెళ్లిన వారికే ప్రాధాన్యత ఇస్తారా..?
ఎన్నికల సమయంలో ఈవీఎంల తరలింపు, కౌంటింగ్ హాళ్ల ఏర్పాటు, ఆహార సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన వంటి అత్యవసర పనులను తాము సకాలంలో పూర్తిచేశామని కాంట్రాక్టర్లు పేరొన్నారు. ఇటీవల మార్చి 25న ఒకసారి అధికారులను కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని వారు వాపోయారు. వ్యవస్థను నమ్ముకున్న మాకు మొండిచేయి ఎదురవుతుంటే.. కోర్టును ఆశ్రయించిన నాంపల్లి, అంబర్‌పేట, మలక్ పేట నియోజకవర్గాలకు చెందిన కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు మాత్రం జీహెచ్ఎంసీ ద్వారా క్లియర్ చేశారని.. అయితే దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. తమ బిల్లులు కూడా క్లియర్ చేయాలని సాయి కిరణ్ అనే కాంట్రాక్టర్ బల్దియా అధికారులను కోరారు.
అప్పులు తెచ్చి పనులు చేస్తే.. ఆదుకోరా?
సొంత పొదుపు మొత్తాలు ఖర్చు చేయడమే కాకుండా, ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఎన్నికల పనులు పూర్తిచేశామని, ప్రస్తుతం రుణదాతల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని కాంట్రాక్టర్లు పేరొన్నారు. ఎన్నికల సమయంలో నిత్యావసర సర్వీసులు అందించిన తమ పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, గ్రీన్ ఛానల్ ద్వారా తక్షణమే 45 పెండింగ్ చెకులను క్లియర్ చేయాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.