Ponguleti Srinivas Reddy | మాదాపూర్, జూన్ 15: తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైనదిగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరై నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో సొంతింటిని కొనుగోలు చేయాలనే కళ ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువైనదని తెలిపారు. చంద్రబాబు నాయుడు అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్ రోడ్డు), మెట్రో డెవలప్మెంట్, మూసీ డెవలప్మెంట్పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ విషయంలో కూడా కంపెనీలు ఇచ్చే సూచనలు పరిగణలోకి తీసుకునేందుకు మరో రెండు రోజుల్లో ఈ అంశాలపై చర్చలు జరుపనున్నట్లు చెప్పారు. ప్రక్క రాష్ట్రంలో వేరే ప్రభుత్వం వచ్చిందని, మన వద్ద ఏదో జరుగుతుందని అపోహ పడవద్దని, బిల్డర్లకు న్యాయమైన అన్ని అంశాల్లో అండగా నిలుస్తామని మంత్రి పొంగులేటి భరోసానిచ్చారు.
ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్టుబడులన్నీ అమరావతికి తరలి పోతాయని, హైదరాబాద్‌లో భూముల ధరలు తగ్గిపోతాయని 10 రోజులుగా ఒకే రకమైన చర్చ జరుగుతున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అమరావతికి పెట్టుబడులు వస్తే రావొచ్చేమో కాని హైదరాబాద్‌కు నష్టం వస్తుందనేది మాత్రం ఒక అపోహ మాత్రమేనన్నారు. హైదరాబాద్ భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా లేదని చెప్పారు. ఎందుకంటే ఈ నగరానికి ఉన్న భౌగోళిక వనరులు, ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలే అందుకు కారణమన్నారు. ఇప్పటికే దేశ, విదేశాల దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని పని చేస్తున్నట్లు తెలిపారు. ఆదిభట్లలో అతి త్వరలో ఫాక్స్‌కాన్ కార్యకలాపాలు ప్రారంభించబోతుందన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణకే గేమ్ ఛేంజర్ లాంటిదని మంత్రి పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలన్నీ పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఫార్మాసిటీ, సెమీ కండక్టర్ పాలసీ, హెల్త్ సెక్టార్, పర్యాటక రంగాల ప్రోత్సాహానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.
ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. శివారు ప్రాంతాల్లోని మరిన్ని గ్రామాలు హైదరాబాద్ నగరం పరిధిలోకి రానున్నాయన్నారు. ఇవన్నీ అంశాలు కూడా హైదరాబాద్ అభివృద్ధితో పాటు సొంతిళ్లు నిర్మాణం చేసుకుని స్థిరపడటానికి, వ్యాపారం చేసుకొని ఎదగడానికి పుష్కలంగా అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు చెందిన వారు స్టాల్స్ ఏర్పాటు చేశారు.