ఆబ్కారీ శాఖలో పదోన్నతులు వచ్చినా పోస్టింగ్లేని విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. సుధీర్ఘ కాలం తరువాత ఆ శాఖలోని కానిస్టేబుళ్లు, సీఐలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లకు పదోన్నతులు వచ్చాయి. కానీ ఆయా స్థాయి పోస్టింగ్‌లు కల్పించడంలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతోందని ఆబ్కారీ వర్గాలు వాపోతున్నాయి. పదోన్నతులు వచ్చిన దాదాపు ఏడు నెలల తరువాత మూడు రోజుల కిందట ఈఎస్, డీసీ, ఏసీ స్థాయి అధికారులకు పోస్టింగ్‌లు కల్పించారు. ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులకు నెలలు గడిచినా పోస్టింగ్‌లు దక్కలేదు. క్యూర్ పరిధిలో దాదాపు 13 కొత్త ఆబ్కారీ స్టేషన్లను ఏర్పాటు చేసినా సీఐ, ఎస్ఐ స్థాయి అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలు లేక కొత్త స్టేషన్ల బాధ్యతలను కూడా పాత స్టేషన్ అధికారులకే అప్పగించారు. దీంతో కొత్త స్టేషన్ల ఏర్పాటుకు అర్థం లేకుండా పోయింది.
-సిటీబ్యూరో
ఆబ్కారీ శాఖలో కానిస్టేబుల్ నుంచి డీసీ వరకు మొత్తం 137 మందికి పదోన్నతులు లభించిన విషయం తెలిసిందే. వారిలో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుళ్లుగా 31మందికి, ఎస్ఐ నుంచి సీఐలుగా 69 మందికి, సీఐ నుంచి ఏఈఎస్లుగా 14 మందికి, ఏఈఎస్ నుంచి ఈఎస్‌గా 14 మందికి, ఏసీ నుంచి డీసీలుగా 9 మంది అధికారులకు పదోన్నతులు లభించాయి. వీరిలో సుదీర్ఘ కాలయాపన తరువాత ఇటీవలే ఏఈఎస్ పైస్థాయి అధికారులకు పోస్టింగ్‌లు కల్పించారు. పదోన్నతులు లభించి 7 నెలలు గడుస్తున్నా పోస్టింగ్‌లు కల్పించకపోవడంతో హోదా పెరిగినప్పటికీ కింది స్థాయిలోనే విధులు నిర్వర్తించాల్సి వస్తోందంటూ ఏఈఎస్‌లు, సీఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోస్టింగ్‌లు ఇవ్వడం ఆలస్యమైనాకొద్దీ వాటికి డిమాండ్ పెరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఫోకల్ ఏరియాలో పోస్టింగ్ కోసం అప్పుడే పైరవీలు మొదలైనట్లు వినికిడి. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ కోసం చాలా మంది పోటీ పడుతున్నట్లు సమాచారం. రాష్ట్రం మొత్తంలో రంగారెడ్డి జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈఎస్, డీసీ, ఏసీ స్థాయి అధికారుల పోస్టింగ్‌లు పూర్తవడంతో ఇప్పుడు ఇన్స్పెక్టర్, ఎస్ఐ స్థాయి అధికారులు ఫోకల్ పోస్టింగ్‌ల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది హెడ్‌కానిస్టేబుల్ నుంచి ఏఈఎస్ స్థాయి పోస్టు వరకు ఉమ్మడి తరంగారెడ్డి జిల్లానే కోరుకుంటున్నట్లు ఆబ్కారీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ధూల్‌పేట మినహా ఇతర ప్రాంతాలకు డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఫోకల్ ఏరియాల్లో పోస్టింగ్‌ల కోసం సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. నచ్చిన పోస్టింగ్‌ల కోసం కొందరు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండగా మరికొందరు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నట్లు ఆబ్కారీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.