Shamshabad | శంషాబాద్ రూరల్, జూలై 8 : భూమి లేకపోయినా ఓ వ్యక్తికి 7 గుంటల భూమి ఉన్నట్టు పట్టాదారు పాస్‌బుక్ రావడంతో శంషాబాద్ మండలంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని అలీకోల్తండాకు చెందిన కేతావత్ పూర్యా నాయక్‌కు సర్వే నంబర్ 192లో 1 ఎకరాల 38 గుంటల భూమి ఉండేది. అయితే 2008లోనే అతడు తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆ భూమిని మరొకరికి విక్రయించాడు. కాగా, కేతావత్ పూర్యానాయక్కు అక్కడే 7 గుంటల భూమి ఉన్నట్లు ధరణి రికార్డుల్లో ఉంది.
ఈ మేరకు ఎమ్మార్వో నాగమణి పూర్యా నాయక్‌కు పట్టాదారు పాస్‌బుక్కును పంపిణీ చేశారు. భూమి లేకపోయినా పట్టాదారు పాస్‌బుక్ చేతికి అందడంతో పూర్యానాయక్ సోమవారం ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వచ్చాడు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఇది ధరణి తప్పిదమా లేక ఎమ్మార్వో నాగమణి చేసిన తప్పిదమా తెలియక 7 గుంటల భూమి కోల్పోయిన వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా లేని భూమికి పట్టాదారు పాస్‌బుక్కులు ఇచ్చిన తహసీల్దార్ నాగమణిపై చర్యలు తీసుకోవాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. ఇరువర్గాలు మధ్య జరిగిన ఘర్షణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తహసీల్దార్ నాగమణి వివరణ కోసం సంప్రదించగా ఆమె అందుబాటులోకి రాలేదు.