Hyderabad | సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): భాగ్యనగరంలో నిర్మాణ రంగం కళ తప్పింది. ఆశించిన స్థాయిలో కొత్త ప్రాజెక్టులు లేకపోవడం, నివాస గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా నెమ్మదించింది. నగరాభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్థిరమైన విధానం లేకపోవడం, అడపాదడపా వచ్చే నిర్మాణ అనుమతుల జారీల్లో భారీగా అవినీతి చోటు చేసుకొన్నది. బిల్డర్లకు ప్రభుత్వం పై నమ్మకం రాకపోవడంతో కొత్త ప్రాజెక్టులంటేనే వారు జంకే పరిస్థితి నెలకొన్నది. క్రయ విక్రయాల్లో మునుపెన్నడూ చూడని స్తబ్ధత నెలకొన్నది. ఇందుకు జీహెచ్ఎంసీ ఏడాది కాలంలో ఇచ్చిన అనుమతులే నత్తనడకన నిర్మాణ రంగం ఉందని అనడానికి అద్దం పడుతున్నాయి. 2023 ఏడాది మొత్తంలో 39,869 నిర్మాణాలకు ఆమోదం పొందగా 2024లో 14,043 నిర్మాణాలకు మాత్రమే అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. గత ఏడాదితో పోల్చితే ఆదాయం రూ.55 కోట్లకు పైగా తగ్గింది.
భారీ ప్రాజెక్టులు లేవ్..
2023 సంవత్సరంలో జీహెచ్ఎంసీ హైరైజ్డ్ బిల్డింగ్లతో కళకళలాడింది. కానీ గడిచిన ఏడాది కాలంలో శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ పరిధిలో హైరైజ్డ్ బిల్డింగ్లకు ఆశించిన స్థాయిలో అనుమతులకు దరఖాస్తులు చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే అనుమతుల రూపంలో రావాల్సిన డబ్బులు పెద్దగా ఖాజానాకు వచ్చి చేరలేదు. గతేడాది రూ.870.96 కోట్ల రూపాయలను బిల్డింగ్ పర్మిషన్ ద్వారా జీహెచ్ఎంసీకి రాబడి వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ కేటగిరీల ద్వారా టీఎస్ బీ పాస్ ద్వారా 57,863 గృహ నిర్మాణాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా.. అందులో 39,869 గృహా నిర్మాణాలకు ఆమోదించారు. అందులో 89 లేఅవుట్లకు అనుమతి కోసం రాగా 36 లేఅవుట్లకు ఆమోదం తెలిపారు. ఈ సారి ఇన్స్ట్రంట్ అఫ్రూవల్స్ 10176, సింగిల్ విండో అనుమతులు 3867 మాత్రమే ఆమోదం పొందాయి. తద్వారా రూ.815.76కోట్ల ఆదాయం ఖాజానాకు చేరింది. అన్నింటి కంటే పెద్ద ప్రాజెక్టులు లేకపోవడం నిర్మాణ రంగం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ స్తబ్ధత నెలకొన్న తరుణంలోనే అనుమతుల మంజూరులో పారదర్శకత లోపించింది. సకాలంలో అనుమతులు ఇవ్వకపోవడం, తరచూ కొర్రీలతో బిల్డర్లను ముప్పుతిప్పలు పెట్టడం, అనుమతులన్నీ నెలల తరబడి కమిషనర్ నిలిపివేయడం లాంటి చర్యలతో నిర్మాణ రంగం తీవ్రంగా నష్టపోయిందని బిల్డర్లు వాపోతున్నారు.
కేసీఆర్ హయాంలోనే నిర్మాణ రంగానికి కళ
కేసీఆర్ ప్రభుత్వంలో హైదరాబాద్ మహా నగరం విశ్వనగరంగా ఎదగడంలో ఐటీతో పాటు రియల్, నిర్మాణ రంగాలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరాభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కింది. కేసీఆర్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో కల్పించిన మౌలిక వసతులతో అంతర్జాతీయ పెట్టుబడులు రావడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. ఇదే క్రమంలో దానికి అనుగుణంగా రియల్, నిర్మాణ రంగం శరవేగంగా ఎదిగింది. అందుకే గత పదేండ్లలో ఏ సంస్థ సర్వేలు చూసినా దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ధీటుగా హైదరాబాద్ రియల్, నిర్మాణ రంగాల పురోగతి కనిపించేది. ప్రధానంగా ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి నగరాలకు లేని ‘విస్తరణ’ వంటి భౌగోళిక అనుకూలతలు హైదరాబాద్కు ఉండటంతో నిర్మాణ రంగం ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. వెస్ట్ కారిడార్కే పరిమితమయ్యే బహుళ అంతస్తుల భవనాలు (ఎంఎస్బీ) అన్నివైపులా విస్తరించడంతో పాటు కోర్ సిటీలోనూ పాత నిర్మాణాలను కూల్చివేసి కొత్తగా ఆకాశహర్మ్యాలను నిర్మించే ట్రెండ్ కొనసాగింది. దీని ద్వారా నగరాభివృద్ధితో పాటు ప్రభుత్వానికి కూడా భారీగానే ఆదాయం సమకూరింది. మరోవైపు బహిరంగ మార్కెట్లోనూ ఆర్థిక చక్రం బలోపేతమై అనుబంధ రంగాలూ కళకళలాడాయి.