Narsingi | మణికొండ, ఏప్రిల్ 28 : హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా నార్సింగి పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం నాడు బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో హైదర్ షాకోట్ విలేజ్, శాంతినగర్ లో దొంగలు రెచ్చిపోయారు. ఒకేసారి నాలుగు ఇళ్లల్లో చోరీలు చేసి విలువైన ఆభరణాలు సామాగ్రిని ఎత్తుకెళ్లిపోయారు. దీంతో నార్సింగి పరిధిలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
సోమవారం నాడు హైదర్షాకోట్, శాంతినగర్‌లో ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను దొంగలు అపహరించుకెళ్లారు. ఆ కాలనీలో నివాసం ఉండే రాజేశ్ ఇటీవల తన కుటుంబసభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాడు. అతను ఇవాళ తిరిగొచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో కంగారుపడిన రాజేశ్ నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. తన ఇంట్లోని 9.5 తులాల నెక్లెస్, మంగళసూత్రాలు కాజేశారని ఫిర్యాదు చేశారు. కాగా, అప్పటికే దొంగలు చుట్టుపక్కల ఉన్న మరో మూడు ఇండ్లలోనూ చోరీ చేశారు. రాజేశ్ పక్కింట్లో ఉన్న కోమలి ఇంటి తాళాలను పగులగొట్టి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇక అదే కాలనీలో ఉండే పట్నం రమేష్ ఇంట్లోని తులం బంగారు ఆభరణాలు చోరి చేయగా, పక్కింట్లో ఉన్న చంద్రారెడ్డి ఇంట్లోని రెండు తులాల బంగారు ఉంగరాలు, రెండు చెవి దిద్దులు, ఓ వెండి గొలుసు చోరీ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నార్సింగి పరిధిలో ఇలా వరుస దొంగతనాలు జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగలు బీభత్సం సృష్టిస్తుంటే కనీసం పెట్రోలింగ్‌ను కూడా సక్రమంగా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ, కోకాపేట, నార్సింగి తదితర ప్రాంతాలలో వరస దొంగతనాలు జరిగినట్లు ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నాయి. అయినప్పటికీ నిఘా వ్యవస్థను పటిష్టం చేయకపోవడం వల్లే ఇలా వరుస దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాటు చేసి దొంగలను పట్టుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే మరిన్ని ఇళ్లను దోచుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు.