మలక్ పేట, మే 17: అర్ధరాత్రి వంటగది కిటికీ లో నుంచి ఇంట్లో చొరబడిన దొంగలు 67 తులాల బంగారు ఆభరణాలు రూ.రెండు లక్షల నగదును అపహరించుకుపోయిన ఘటన చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చాదర్ ఘాట్‌లోని ఆజంపుర వే బ్రిడ్జి సమీపంలో నివసించే ప్రైవేటు ఉద్యోగియైన మహమ్మద్ ఫహీముద్దీన్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.
శుక్రవారం రాత్రి 11 గంటలకు ఫహీముద్దీన్ కుమార్తె ఖారీయా జహాన్ లు భోజనానంతరం వేర్వేరు గదుల్లో నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వంటగది కిటికీలోనుంచి ఇంట్లోకి దూరిన దొంగలు ఫ్రిడ్జ్ లోని పండ్లను తిని, బీరువా హ్యాండిల్ కు తగిలించిన తాళం చెరువులతో బీరువాని తెరిచి వెతికారు. బట్టల కింద ల్యాకర్ తాళాలు లభించడంతో లాకర్ తెరిచి అందులోని సుమారు 67 తులాల బంగారు ఆభరణాలు, రూ .రెండు లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
తెల్లవారుజామున ఫహిముద్దీన్ గదిలోకి వెళ్లి చూడగా, బీరువా తలుపులు తెరవబడి మంచం మీద, కింద వస్తువులు చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. బాధితుడు శనివారం ఉదయం చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ టీం సభ్యులతోపాటు పోలీసు జాగిలాలను రప్పించారు. వేలిముద్రలు సేకరించిన పోలీసులు, సౌత్ ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ రఘు ఆదేశాల మేరకు నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలాన్ని మలక్ పేట ఏసీపీ శ్యాంసుందర్, చాదర్ ఘాట్ ఇన్ స్పెక్టర్ బ్రహ్మ మురారి, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ భూపాల్ గౌడ్ సందర్శించారు.