సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్‌లో జరిగిన చోరీ ఘటనపై బాధితుడు బెంగళూరులో ఫిర్యాదు చేయగా.. అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ కేసును దర్యాప్తు నిమిత్తం తిరిగి సైబరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేయనున్నారు. వివరాలిలా ఉన్నాయి.. బెంగళూరుకు చెందిన ప్రకాశ్ ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 9న గచ్చిబౌలిలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జరిగిన సదస్సుకు హాజరయ్యాడు.
అయితే, అతడి ల్యాప్‌టాప్, రూ.70 వేల నగదుతో కూడిన బ్యాగు చోరీకి గురయ్యింది. ఆ రోజు సదస్సు సాయంత్రం వరకు జరిగింది. బెంగళూరు వెళ్లేందుకు విమాన సమయం కూడా కావడంతో స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయలేకపోయాడు. బెంగళూర్‌లోని కూబన్ పార్కు పీఎస్‌లో తన బ్యాగ్ చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేశాడు. అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును తిరిగి సైబరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేస్తున్నారు. సైబరాబాద్‌కు బదిలీ అయిన తరువాత.. గచ్చిబౌలి పీఎస్‌లో కొత్తగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు.