e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home హైదరాబాద్‌ తీగ లాగారు..!

తీగ లాగారు..!

  • ట్రాన్స్‌ఫార్మర్లను పడగొట్టి.. రాగితీగతో పరార్‌
  • పొద్దంతా రెక్కీ.. రాత్రి 11 తర్వాత చోరీలు
  • గ్రామ శివారుల్లోని ట్రాన్స్‌ఫార్మర్లే టార్గెట్‌
  • పారిశ్రామిక వాడల్లో అమ్మేసి.. వచ్చిన సొమ్ముతో జల్సాలు
  • అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు నిందితులు అరెస్టు
  • సుమారు రూ.25 లక్షల సొత్తు స్వాధీనం
  • పరారీలో మరో ఇద్దరు నిందితులు

సిటీబ్యూరో, అక్టోబర్‌ 13(నమస్తే తెలంగాణ) : విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగి తీగను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను బుధవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో 77 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ కేసుల మిస్టరీ వీడింది. ఎల్బీనగర్‌లోని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నందులాల్‌ రాజ్బర్‌, అభిమన్యు రాజ్బర్‌, రాహుల్‌ రాజ్బర్‌, సహదేవ్‌ కొన్నేండ్ల కిందట నగరానికి వచ్చి పలు ప్రాంతాల్లో కార్మికులుగా పని చేశారు. ఆదాయం సరిపోకపోవడంతో రాగి తీగల చోరీలకు పాల్పడి గతంలో జైలుకు కూడా వెళ్లివచ్చారు. అయినా బుద్ధిమారలేదు.

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను పడగొట్టి వాటిలో నుంచి రాగి తీగను తీసి అమ్ముకుని జల్సాలు చేయడం వీరికి పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా.. బుధవారం ఉదయం 6 గంటలకు ముఠాలోని నందులాల్‌, అభిమన్యు కందుకూరు లేమూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా కారులో తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తీగలాగితే.. డొంక కదిలినట్లు.. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి తీగను చోరీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.

- Advertisement -

ఇప్పటి వరకు 77 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను పడగొట్టి అందులో నుంచి రాగి తీగను దొంగిలించినట్లు తెలిపారు. నిందితుల నుంచి 160 కేజీల రాగి తీగ, కారు, నాలుగు బైక్‌లు, రూ.18.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మరో ఇద్దరు నిందితులు సహదేవ్‌, రాహుల్‌ పరారీలో ఉన్నారు.

పొద్దంతా రెక్కీ, రాత్రి చోరీ..

ముఠా సభ్యులు పొద్దంతా రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌ శివారు ప్రాంతాలతో పాటు సంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్‌ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో బైక్‌లు, కార్లలో రెక్కీ నిర్వహిస్తారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంగా పొలాల్లో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఎంచుకుంటారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత అక్కడికి వెళ్లి ముందుగా తాళ్లతో వైర్లను ఆణించి విద్యుత్‌ను ఆపేస్తారు. ఆ తర్వాత ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉన్న బోల్టులను విప్పేసి కర్రలతో కిందపడేస్తారు.

సబ్‌స్టేషన్‌కు అనుసంధానంగా ఉన్న ఫీడర్‌లో విద్యుత్‌ సరఫరా ఆగిపోయిందా.. లేదా..? చూస్తారు. తర్వాత ట్రాన్స్‌ఫార్మర్‌ను విప్పి అందులో ఉండే ఆయిల్‌ పారబోస్తారు. అనంతరం అందులో ఉండే 40కేజీల రాగి తీగను తీసుకుని పారిపోతారు. ఇలా ఏడాది కాలంలో 77విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి తీగను తస్కరించి పారిశ్రామిక వాడల్లో తక్కువ ధరకు అమ్మేశారు. వచ్చిన మొత్తాన్ని అందరూ సమానంగా పంచుకున్నారు. ఇలా సంపాదించిన డబ్బుతో బంగారం, ఎలక్ట్రికల్‌ సామగ్రి కొనుగోలు చేయడంతో పాటు కొంత నగదును వారి సొంత రాష్ర్టాలకు పంపించినట్లు దర్యాప్తులో తేలింది.

30 రోజుల్లో 9 ట్రాన్స్‌ఫార్మర్లు..!

కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నెల రోజుల వ్యవధిలోనే 9 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను పడగొట్టి రాగి తీగలు ఎత్తుకెళ్లారనే ఫిర్యాదులు నమోదయ్యాయి. దీనిపై సమీక్షించిన సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. కందుకూరు, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తును వేగవంతం చేయడంతో ఈ ముఠా గుట్టు బయటపడింది. ఈ సమావేశంలో క్రైం డీసీపీ యాదగిరి, ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి, క్రైమ్స్‌ ఏసీపీ శేఖర్‌రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement