జీడిమెట్ల, జూలై 7 : తాను పనిచేస్తున్న వ్యక్తి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన యువకుడితోపాటు మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సోమవారం బాలానగర్ ఏసీపీ పింగళి నరేశ్ రెడ్డి వివరాలను వెల్లడించారు. సుభాశ్‌నగర్ డివిజన్ ఎస్సార్ నాయక్ నగర్ కు చెందిన సంగమేశ్వర్ పాల వ్యాపారం చేస్తూ ఈనెల రెండవ తేదీన పటాన్‌చెరులోని ఓ ఫంక్షన్‌కి వెళ్లాడు. ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని తన కుమార్తెకు ఫోన్లో విషయం తెలిపాడు. ఫోన్లో మాట్లాడటాన్ని అతడి దుకాణంలో పనిచేసే మహమ్మద్ ఆసిఫ్ విన్నాడు. తన ఇద్దరు స్నేహితులైన ఆసిఫ్, అమీర్ లతో కలిసి ఇంట్లోకి వెళ్లి రూ. 3.50లక్షల నగదును తీసుకొని అక్కడి నుంచి జారుకున్నారు. సంగమేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరాలను పరిశీలించగా ముగ్గురు యువకులు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆసిఫ్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ఆసిఫ్, అమీర్ లను సోమవారం అదుపులో తీసుకున్నారు. దొంగతనం చేసిన రూ.3.50 లక్షలు ముగ్గురు పంచుకోగా అందులో రూ. 1 లక్ష 35 వేలు బెట్టింగులో పెట్టారు. నిందితుల నుంచి రూ. 2 లక్షల 15 వేలు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. సీఐ మల్లేశ్, డీఐ కనకయ్య, డీఎస్ఐ శ్యాంబాబు, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్, కానిస్టేబుళ్లు ప్రేమ్ కుమార్, నరేశ్, మోహన్, రాజ్ కుమార్, సుబ్బారావు లను ఏసీపీ నరేశ్ రెడ్డిని అభినందించారు.